సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు 

24 Dec, 2023 05:12 IST|Sakshi

ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత, నిష్పాక్షికతతో ఎన్నికలు జరగాలి 

ఒక్క తప్పూ లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి 

పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు 

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి 

కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ 

2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష 

సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో  సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది.

ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ,  నితీష్‌ కుమార్‌ వ్యాస్, స్వీప్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అజ్మేరా, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్, అండర్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్, డైరెక్టర్‌ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా, అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరేంధిర తదితరులు హాజరయ్యారు.

జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్‌ ఇవ్వగా, శని­వారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. 

ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబు­దారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్‌ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో  పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు.

ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్‌ టెక్నా­లజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్‌ మేనేజ్‌మెంట్‌ (డిస్పాచ్‌ సెంటర్, రిసీట్‌ సెంటర్, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలు, ట్రైనింగ్‌ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్‌ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంలు కూడా కీలకమని చెప్పారు.  

ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్‌ ప్రణాళిక 
గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్‌ స్టేషన్ల వారీగా పోలింగ్‌ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసి­పేషన్‌ (స్వీప్‌) కార్యక్రమాలు చేపట్టాలని సూ­చిం­చారు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యే­కంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్‌ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్‌ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్‌ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ  రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్‌ 
రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ బృందం ధన్యవా­దాలు తెలిపింది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృ­త్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మ­క సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పా­క్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచా­యని కలెక్టర్‌ డిల్లీరావు చెప్పారు.

ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా. పి.సంపత్‌ కుమార్, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్, డీఆర్వో ఎస్‌వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

సరిహద్దుల్లో నిఘా పెంచాలి 
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్‌ మౌలిక సదుపాయాలపై చర్చించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్‌  శాఖ, సెబ్‌ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని  సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా  పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్‌ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు.  

దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ శర్మ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు.  ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్‌.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్, వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు