Sankranti 2024 CockFightings: పుంజు భలే రంజుగా!

24 Dec, 2023 06:07 IST|Sakshi

సంక్రాంతి పందేలకు సిద్ధమవుతున్నకోడి పుంజులు 

మూడు నెలల ముందే మొదలైపోయిన ప్రత్యేక శిక్షణ 

ఒక్కో పుంజుపై రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యయం 

మేత మెనూలో మటన్, గుడ్డు, బాదం, ఎండు ఖర్జూరం, తదితరాలు 

ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, శరీర పటుత్వానికి నీళ్లపోత 

పందేలరాయుళ్ల నుంచి పెంపకందారులకు ముందుగానే అడ్వాన్సులు 

పుంజును బట్టి ఒక్కోదానికి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర  

పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.12 కోట్లకు పైగా వ్యాపారం 

సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు.

ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు.

మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే 
ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు.

పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి.

మటన్‌ నుంచి డ్రైప్రూట్స్‌ వరకు.. 
శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు.  

పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. 
పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్‌ లిక్కర్‌ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు.

వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్‌ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు.  

రూ.కోట్లలో వ్యాపారం 
మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది.

ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది.

పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. 
బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా.  

కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. 
వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు.

వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. 

పందెం పుంజు దినచర్య ఇలా.. 
ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్‌లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్‌) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. 

>
మరిన్ని వార్తలు