పసుపు ఛాయకు.. సిరుల పరిమళం

4 Dec, 2021 16:26 IST|Sakshi

ఏజెన్సీలో సాగు..మాడుగులలో ప్రాసెస్‌

విదేశాలకు ఎగుమతులు.. ఏటా రూ.200 కోట్ల వ్యాపారం

1500 కుటుంబాలకు జీవనాధారం

వందల ఏళ్ల నుంచి ఇక్కడ పసుపు వ్యాపారం సాగుతోంది. పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పసుపు వ్యాపారులు కూడా అధికంగా ఉన్నారు. విశాఖ మన్యం 11 మండలాల్లో పండించే పసుపంతా మాడుగుల చేరుతుంది. ప్రాసెసింగ్‌ జరిగి సిరులు కురిపిస్తుంది. ఔషధ గుణాలున్న ఈ ఆర్గానిక్‌ పసుపు మంచి గిరాకీ కలిగి ఉండడమే కాదు..పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కరోనాను కూడా దరి చేరనివ్వలేదని దీని గొప్పతనాన్ని చెబుతున్నారు.

విశాఖ మన్యంలో సేంద్రియ పద్ధతి పండించే పసుపులో ఔషధ గుణాలున్న కురుక్కుమిన్‌తో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఓలంటయిల్‌ ఉంది. ఏజెన్సీలో రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా ఆవు పేడ, ఆవు పంచకంతో పండించే ఆర్గానిక్‌ పంట కావడం కూడా  విశేషం. దీంతో ఇక్కడ ప్రాసెస్‌ అయ్యే పసుపునకు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పండించే పసుపులో కురుక్కుమిన్‌ 1.5 నుండి 2 శాతం ఉంటే మాడుగుల పసుపులో 5 శాతం కురుక్కుమిన్‌ ఉంది. అంతేకాకుండా ఆరెంజ్‌ ఎల్లో రంగులో ఈ పసుపు ఉంటుంది. ఈ రంగు ఉన్న పసుపును అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైనదిగా గుర్తిస్తారు. ఇక్కడ పసుపును స్త్రీలు ముఖానికి రాసుకున్నా మంట పుట్టదు..ముఖం మెరుపుఛాయ రావడం, వంటకాలలో ఉపయోగిస్తే రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  

1500 కుటుంబాలకు జీవనోపాధి  
విశాఖ మన్యంలో పండించే పసుపు మాడుగులకు తీసుకు వస్తారు అక్కడ ప్రాసెసింగ్‌ చేసి శుభ్రపరిచిన తరువాత ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్‌లో సుమారు 300 లారీలు పసుపును 200 మంది చిన్నా పెద్ద వ్యాపారులు మాడుగులలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ పసుపును ఉడికించి డ్రమ్ముల్లో వేసి మంచి ఛాయ పసుపుగా తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్‌లలో వేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ విధంగా రైతుల దగ్గర నుంచి  మార్కెట్‌కు వెళ్లే వరకు సుమారు 1500 కుటుంబాలు దీనిపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాడుగులలో ఆరు పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 

పన్ను రాయితీ మేలు  
రూ.5 లక్షలు వ్యాపారం వరకు జీఎస్టీ రాయితీ ఇవ్వడం వల్ల చిరు పసుపు వ్యాపారులకు మేలు జరగనుంది. ప్రభుత్వ పరంగా పసుపు పరిశ్రమకు చేయూతను అందిస్తుంది. పసుపు రైతులకు ప్రోత్సాహకాలు అందజేయాలి. మాడుగుల పసుపునకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుండడం వాస్తవమే. 
–బసవా పరమేష్, పసుపు వ్యాపారి, మాడుగుల 

కుర్కుమిన్‌ అధికం  
కుర్కుమిన్‌ అధికంగా ఉండే పసుపును తమిళనాడులో ఎక్కువగా ఇష్టపడతారు. కుర్కుమిన్‌ అధికంగా ఉండే పసుపుతో వంటకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఔషధాలు ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ ఉంది. ప్రస్తుతం కిలో రూ.75 నుంచి రూ. 80 వరకు ధరలు పలుకుతున్నాయి.   
–దేవరాపల్లి శ్రీనివాసరావు, పసుపు వ్యాపారి 

పసుపు కేంద్రాలే జీవనాధారం 
మాడుగులలో తరతరాలుగా పలు కుటుంబాలు పసుపు తయారీతో జీవనోపాధి పొందుతున్నాయి. ఏజన్సీలో పండించే పసుపు నుంచి మాడుగులలో ప్రాసెసింగ్‌ జరిగే వరకు సుమారు 1500 కుటుంబాలకు జీవనాధారంగా మారింది. నిరంతరం పసుపులో పని చేయడం వలన మాకు కరోనా కూడా దరి 
చేరలేదు.  
–కోడూరు అప్పారావు, పసుపు కార్మికుడు, మాడుగుల 

మరిన్ని వార్తలు