మహిళల వసతి గృహంలో వడ్డిస్తుండగా సాంబారులో బల్లి.. అప్పటికే తిన్న వారికి..

11 Jul, 2022 14:42 IST|Sakshi
భోజనం ప్లేటులో ఉన్న బల్లి

ఎచ్చెర్ల క్యాంపస్‌(శ్రీకాకుళం): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహం (నాగావళి)లో శనివారం రాత్రి భోజనాల సమయంలో సాంబారులో బల్లి కనిపించింది. రాత్రి 9.30 సమయంలో విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విద్యార్థినికి సాంబారు వేస్తుండగా బల్లి కనిపించింది. దీంతో విద్యార్థి నులంతా భోజనాలు ఆపేశారు. అంతా కలిసి వసతి గృహం వద్ద వంట నిర్వహణ సిబ్బందికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

అయితే అప్పటికే తిన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వర్సిటీ ఆరోగ్య సిబంది సైతం పర్యవేక్షించారు. నిరసనకు దిగిన విద్యార్థులతో వసతి గృహ నిర్వాహకులు చర్చలు జరిపారు. చివరకు మళ్లీ వంట చేసి రాత్రి 11.30 సమయంలో భోజనం పెట్టారు. విద్యార్థులు ఫోన్‌లో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంటకు వాడుతున్న నీటి నిర్వహణ, వంట గది పారిశుద్ధ్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు చేశారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా లోపాలపై దృష్టిపెట్టడం లేదని విద్యార్థులంటున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్ర ప్రసాద్‌ వద్ద విషయం ప్రస్తావించగా దీనిపై విచారణ నిర్వహిస్తామన్నారు.

చదవండి: ఇంజినీర్‌ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో..  

మరిన్ని వార్తలు