ఉచిత విద్యుత్‌.. మరింత పకడ్బందీగా..

7 Jan, 2021 04:50 IST|Sakshi

6,663 ఫీడర్లు బలోపేతం.. లోవోల్టేజీ సమస్యకు చెక్‌

రూ.6,600 కోట్లతో 85 కొత్త ప్రాజెక్టులు

పంపుసెట్ల కోసం పక్కా ప్రణాళిక

మండు వేసవిలోనూ ఫుల్‌ పవర్‌

ఏటా 20 శాతం అదనపు వినియోగం

అయినా 9 గంటల ఉచితానికి ప్రత్యేక ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం ఇక నుంచి మరింత సమర్థవంతంగా పనిచేయనుంది. క్షేత్రస్థాయి నివేదికల తర్వాత విద్యుత్‌ సంస్థలు కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 6,663 వ్యవసాయ ఫీడర్లను బలోపేతం చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను విడగొట్టి లోవోల్టేజీ సమస్య రాకుండా చేశారు. రూ.6610.5 కోట్లతో చేపట్టిన కొత్త ప్రాజెక్టులూ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ రబీ నుంచే వంద శాతం ఫీడర్ల ద్వారా విద్యుత్‌ ఇస్తున్న విద్యుత్‌ శాఖ.. వచ్చే ఖరీఫ్‌ నుంచి మరింత సమర్థవంతంగా ఫీడర్లను పనిచేయించే లక్ష్యంతో ఉంది. 

పెరుగుతున్న డిమాండ్‌
అధికారిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా 20 శాతం విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్‌ ఇస్తున్న నేపథ్యంలో పీక్‌ అవర్స్‌లో గ్రిడ్‌పై ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల విస్తరణ చేపట్టారు. విద్యుత్‌ సంస్థలు రూ.6,610.5 కోట్లతో మొత్తం 85 కొత్త ప్రాజెక్టులు దాదాపు పూర్తికానున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్‌ లైన్ల పొడిగింపు, అత్యధిక సామర్థ్యంగల హైపవర్‌ కండక్టర్ల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌), డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ), గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (ఐబీఆర్‌డీ), ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ కోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పుతోంది. ఈ విద్యుత్‌ను రైతుకు చేరవేసే దిశగా గ్రిడ్‌ను బలోపేతం చేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందుతుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. నెట్‌వర్క్‌ బలోపేతం తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశామని ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు