నకిలీ మందులకు కళ్లెం

6 Mar, 2021 05:38 IST|Sakshi

‘ఇంటెలిజెన్స్‌ శాంపిలింగ్‌ సిస్టం’ పేరుతో ఔషధ నియంత్రణ శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం

నూతన మందులు మార్కెట్లోకి రాగానే దాని నమూనాల పరిశీలన

మందుల సేకరణలో జాగ్రత్తపడుతున్న హోల్‌సేలర్లు, రిటైలర్లు

సత్ఫలితాలిస్తున్న కొత్త విధానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ లేదా నాసిరకం మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధ నియంత్రణ శాఖ సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ ఎక్కడో ఓ చోట మందుల నమూనాలను సేకరించడం, వాటిని పరీక్షించడం ఆ ఫలితాలను బట్టి చర్యలు తీసుకోవడం జరిగేది. కానీ, దీనివల్ల సరైన ఫలితాలు వచ్చేవి కావు. దీంతో నాసిరకం మందులు మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అయ్యేవి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘ఇంటెలిజెన్స్‌ శాంపిలింగ్‌ సిస్టం’ను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. ఈ విధానం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ఇదే ఇప్పుడు భీమవరంలో నకిలీ మందులను కనిపెట్టేలా చేసింది. దీంతో మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చే మందులపై నిఘా పెరిగింది. ఈ విధానం అమల్లోకి రావడంతో హోల్‌సేలర్లు, రిటైలర్లు కూడా మందుల సేకరణలో జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇంటెలిజెన్స్‌ శాంపిలింగ్‌ విధానం అంటే..
► ఏ ఉత్పత్తిదారుడైనా తన ట్యాబ్‌లెట్లు రెండు బ్యాచ్‌లు.. రెండు దఫాలు ఎన్‌ఎస్‌క్యూ (నాట్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ–నాణ్యత లేదని) అని తేలితే సదరు కంపెనీ మందులను ఔషధ నియంత్రణ శాఖ సేకరిస్తుంది.
► ఉత్పత్తిదారుడి హోల్‌సేల్‌ లైసెన్సు సస్పెండైనా లేదా రద్దయినా, జీఎంపీ (గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) ఉల్లంఘించినా అలాంటి సంస్థల మందులను సేకరిస్తుంది.
► కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందులు లేదా ఎక్కువ ధర ఉన్నా, అలాగని తక్కువ ధరకు అమ్ముతున్నా అలాంటి వాటినీ పరిశీలిస్తారు.
► మందుల లేబుల్‌ లేదా ప్రింట్‌ వంటివి అనుమానం కలిగించేలా ఉన్నా.. మందుల పేర్లలో తప్పులున్నా అలాంటి వాటిపైనా ఔషధ నియంత్రణ శాఖ కన్నేస్తుంది.
► అంతేకాక.. ప్యాకింగ్‌లో నాసిరకం మెటీరియల్‌ వాడినా, అక్షరాలు కనిపించకుండా ఉన్నా వాటిపై నిఘా వేసి వేస్తుంది.
► సాధారణంగా సూపర్‌ స్టాకిస్ట్‌–స్టాకిస్ట్‌–హోల్‌సేలర్‌–రిటైలర్‌ క్రమ పద్ధతిలో సరఫరా కావాలి. ఇలా కాకుండా మార్కెట్లోకి వచ్చిన వాటిపైనా కన్నేస్తారు.
► ఏవైనా మందులకు స్కీములు ఇచ్చినా, ఇన్సెంటివ్‌లు ఇచ్చినా వాటినీ నియంత్రిస్తారు.
► ఇవన్నీ కాకుండా మందుల ప్రభావం గురించి డాక్టర్లు, మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌లు, కెమిస్ట్‌ల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆ మందులను పరిశీలిస్తారు.

నకిలీలను అరికట్టేందుకే ఈ విధానం
గతంలో ఎక్కడంటే అక్కడ నమూనాలను సేకరించే వారు. దీనివల్ల ఫలితాలు ఆశించినంతగా ఉండేవి కావు. ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ శాంపిలింగ్‌ విధానం అమలుచేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చాం. దీనివల్ల మంచి మందులు మాత్రమే వినియోగదారులకు చేరే అవకాశం ఉంటుంది. హోల్‌సేలర్లు, రిటైలర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధానం మరింత పకడ్బందీగా అమలుచేస్తాం.
– రవిశంకర్‌ నారాయణ్, డైరెక్టర్‌ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ  

మరిన్ని వార్తలు