288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం

15 Nov, 2021 05:18 IST|Sakshi
గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఎస్‌ఈబీ బృందాలు

విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న ఆపరేషన్‌ పరివర్తన  

పాడేరు : ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి చెప్పారు.

జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై  గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. 

మరిన్ని వార్తలు