Devaragattu Bunny Festival 2022: దేవరగట్టు.. సంప్రదాయానిదే పట్టు

3 Oct, 2022 20:45 IST|Sakshi

5న మాళమల్లేశ్వరుని కల్యాణోత్సవం

అనంతరం ప్రారంభం కానున్న జైత్రయాత్ర

వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు

భారీగా మోహరించనున్న పోలీసులు

సమరం కాదు ఆచారం అంటున్న మూడు గ్రామస్తులు 

హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న దసరా బన్ని ఉత్సవానికి  దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్‌..ర్ర్‌... గోపరక్‌... బహుపరాక్‌ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రా ష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.  


ఉత్సవం జరుగుతుందిలా.. 

దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి  తీసుకెళ్తారు. ఆలయంలో మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జెత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి, పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి  చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. 


రక్త సంతర్పణ
 
ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక.. అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగడంతో వచ్చే రక్తాన్ని రాతి గుండులకు విసురుతారు. ఉదయంలోపు అక్కడ రక్తపు మరకలు ఉండవని రాక్షసులు సేవిస్తారని భక్తుల నమ్మకం.  


భవిష్యవాణి  

శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో పూజారి, ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరు ఒక్కసారిగా మొగలాయిని(కర్రలతో కొట్టుకోవడం) నిలిపి వేసి  నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ స్థితులు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్‌... గోపరాక్‌ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ సమయంలో భక్తుల మధ్య జరిగే ఊరేగింపు మరింత భయంకరంగా ఉంటుంది. అప్పుడే చాలామంది భక్తులు గాయాలపాలవుతారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది.  


భారీగా పోలీస్‌ బందోబస్తు 

బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్‌ తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి 800 మంది సివిల్‌ పోలీసులు, ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే 200 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి 120కు పైగా సీసీ, 4 డ్రోన్‌ కెమెరాలు వినియోగించనున్నారు. పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు. 


ఉత్సవ వివరాలు
 
► ఈ నెల 5వ తేదీ బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం 
► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత  జైత్రయాత్ర మొదలు 
► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు 
► 7వ తేదీ  నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. 
► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం  వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. 
► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.  


భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే... 

పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారు చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించే వారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 


144 సెక్షన్‌ అమలు 

దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పోలీసు నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 200 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం.
– అబ్దుల్‌జహీర్, ఎస్‌ఐ, హొళగుంద

మరిన్ని వార్తలు