ఏ వ్యవస్థ అధికారాలేమిటో తేలుద్దాం

6 Mar, 2022 04:40 IST|Sakshi

శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి

సీఎం వైఎస్‌ జగన్‌కు సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ 

చట్టాలు చేసే, నిర్ణయాలు తీసుకునే అధికారం అసెంబ్లీకి, ప్రభుత్వానికి లేదంటే ఎలా?

ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేస్తున్న హైకోర్టు తీర్పు 

ఇది శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాజధాని వ్యవహారంపై హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పు నేపథ్యంలో ‘అధికారాల విభజన సిద్ధాంతం’పై చర్చించేందుకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అధికారాలు, పరిమితులు ఏమిటో విపులంగా చర్చిద్దామన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు అధికారాల విభజనలో మన రాజ్యాంగం సమతుల్యతను పాటించిందని స్పష్టం చేశారు.

అయితే రాజధాని వ్యవహారంలో హైకోర్టు వెలువరించిన తీర్పు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా, ప్రశ్నార్థకంగా మార్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు విధానాలను సమీక్షించకుండా, మౌన ప్రేక్షకుల్లా మిన్నుకుండిపోవడానికి ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, బాధ్యతలతో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా సుపరిపాలన అందిస్తాయని విశ్వసించే ఎవరినైనా హైకోర్టు తీర్పు ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. 

ఆ తీర్పుతో కలత చెందాను 
► సీనియర్‌ ఎమ్మెల్యే అయిన నేను ప్రజా జీవితంలో గ్రామ సర్పంచి నుంచి మంత్రి వరకు వివిధ స్థాయిల్లో పని చేశాను. చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు.. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదంటూ గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగ బద్ధమైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మనుగడ, ఔచిత్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన చెందాను. 
► రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసే సర్వాధికారం శాసన వ్యవస్థకు ఉందనే అంశం మీకు తెలుసు. చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో చట్టాలు చేయడంలోనూ.. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ అత్యున్నత అధికారం శాసన వ్యవస్థకే రాజ్యాంగం కట్టబెట్టింది. 
► రాజధాని నగరాన్ని మార్చే.. లేదా విభజించే.. లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదని, ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రభుత్వాల విధానాలను మార్చడానికి వీల్లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే.. ప్రశ్నార్థకం చేయడమే. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ఎవరినైనా ఈ తీర్పు ఆందోళనకు గురిచేస్తుంది. 
► ఈ నేపథ్యంలో రాజ్యాంగం.. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య విభజించిన అధికారాలపై చర్చించేందుకు తక్షణమే శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

మరిన్ని వార్తలు