జనాభా లెక్కన డిజిటల్‌ లైబ్రరీ వసతులు

6 Aug, 2021 04:16 IST|Sakshi

వెయ్యిలోపు జనాభాకు 2 డెస్క్‌టాప్‌లు

వెయ్యి నుంచి 3 వేలలోపు 4.. ఆపైన 6

మొదట 4,530 గ్రామాల్లో ఏర్పాటు

సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న డిజిటల్‌ లైబ్రరీల్లో వసతుల కల్పన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. కోవిడ్‌ తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి పెరుగుతున్న డిమాండ్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. ఈ లైబ్రరీల్లో జనాభా ప్రాతిపదికన కంప్యూటర్‌ ఉపకరణాలను ఏర్పాటు చేయనున్నారు. జనాభా వెయ్యిలోపు ఉన్న గ్రామాల్లో 2 డెస్క్‌టాప్‌లు, వెయ్యి నుంచి 3 వేలలోపు ఉన్నచోట 4, ఆపైన ఉన్నచోట 6 డెస్క్‌టాప్‌లను ఏర్పాటు చేయనున్నుట్లు ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌శాఖ ముఖ్య కార్యదర్శి జె.జయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.

తొలుత 6 కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. తర్వాత జనాభా, డిమాండ్‌ ఆధారంగా కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కంప్యూటర్‌ ఉపకరణాలను సమకూర్చడానికి ఒక్కో లైబ్రరీకి రూ.2 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు వ్యయం అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) అంచనా వేసింది. మొదట 4,530 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఈ డిజిటల్‌ లైబ్రరీ పనులను ఈ నెల 15లోగా ప్రారంభించి మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణ పనుల్ని పంచాయతీరాజ్‌శాఖ చేపట్టనుండగా, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ డిజిటల్‌ లైబ్రరీలకు అవసరమైన ఫర్నిచర్, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు వంటివాటి ఏర్పాటును ఆయా సచివాలయాలు చూసుకుంటాయని జయలక్ష్మి తెలిపారు.  

మరిన్ని వార్తలు