మైక్రోప్లాస్టిక్‌పై ప్రత్యక్ష పరిశోధన

20 Nov, 2023 05:38 IST|Sakshi

ఇందుకోసం ఆంధ్రా యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ 

సహకారం అందిస్తున్న యూరోపియన్‌ కమిషన్‌ 

సముద్ర జీవుల్లో భారీ ఎత్తున మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు 

ఏయూ క్యాంపస్‌: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్‌ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్‌ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్‌ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రా­లు సూప్‌ ఆఫ్‌ మైక్రోప్లాస్టిక్స్‌గా మారడమే.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్‌ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్‌ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌ విభాగం, యూరోపియన్‌ కమిషన్‌ సహాయంతో పరిశోధనలు చేపట్టింది.  

విస్తృత పరిశోధనకు శిక్షణ 
ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. 

ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ 
అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా  రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్‌ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. 

చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్‌ గుర్తింపు 
నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు,  మైక్రోప్లాస్టిక్‌ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోం­ది. 

మూడు అంశాలపై శిక్షణ 
సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్‌ ట్రాన్స్‌ఫామ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్‌టీఐఆర్‌) సహాయంతో మైక్రోప్లాస్టిక్‌ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్‌టీఐఆర్‌లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు.   

మంచి ఆలోచన 
ఎంఎల్‌ఆర్‌ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్‌ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం.  – డాక్టర్‌ వి.హేమ శైలజ,  ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం 

విలువైన సమాచారం 
మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి.  – డాక్టర్‌ జి.శ్రావణ్‌ కుమార్, అధ్యాపకులు,  జీవీపీ కళాశాల 

కమిషన్‌ సహకారం మరువలేం 
యూరోపియన్‌ కమిషన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్‌ యూనియన్‌ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ 

మరిన్ని వార్తలు