ఒక్కరోజే రూ.1,383.34 కోట్ల పింఛన్ల పంపిణీ

2 Aug, 2022 02:56 IST|Sakshi

ఈ నెల మొత్తం 62.79 లక్షల మందికి పింఛన్లు

తొలిరోజు 54.45 లక్షల మందికి పంపిణీ పూర్తి

మొదటి రోజు 86.72 శాతం మందికి అందజేత

మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం

సాక్షి, అమరావతి/టెక్కలి/నందిగాం/నాయుడుపేట టౌన్‌: రాష్ట్రంలో అవ్వాతాతలతోపాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు తదితరులకు ప్రభుత్వం సోమవారం ఒక్క రోజే రూ.1,383.34 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఆగస్టులో 62.79 లక్షల మందికి పంపిణీ చేసేందుకు రూ.1,596.77 కోట్ల మొత్తాన్ని శనివారం నాడే అన్ని గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 3,10,222 మందికి ప్రభుత్వం కొత్తగా ఈ నెల నుంచే పింఛన్లు మంజూరు చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మొదటి రోజు ఆగస్టు 1నే 54,45,798 మందికి పింఛన్‌ నగదు అందజేశారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు పంపిణీ చేశారు. కాగా, తొలిరోజు 86.72 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. మరో నాలుగు రోజుల పాటు పంపిణీ కొనసాగుతుందని బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 

టీడీపీ మాజీ సర్పంచ్‌కు పింఛన్‌
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీలో టీడీపీ మాజీ సర్పంచ్‌ రాములమ్మకు వితంతు పింఛన్‌ మంజూరైంది. ప్రభుత్వ పారదర్శకతకు ఇదో నిదర్శనమని స్థానికులంటున్నారు. ఆమె సర్పంచ్‌గా ఉన్నప్పుడు భర్త మరణించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పింఛన్‌ మంజూరు కాలేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాములమ్మకు పింఛన్‌ మంజూరు చేశారు. ఈ మేరకు సర్పంచ్‌ గుజ్జు మోహన్‌రెడ్డి చేతుల మీదుగా> ఆమెకు పింఛన్‌ అందజేశారు.  

94 ఏళ్ల వయసులో పింఛన్‌
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన అక్కరపాక లక్ష్మమ్మకు 94 ఏళ్లు. ఆమె భర్త చనిపోయి చాలా ఏళ్లయింది. పింఛను కోసం గతంలో చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని లక్ష్మమ్మ చెబుతోంది. ఇక ఎప్పటికీ రాదనుకున్నానని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటికే పింఛను వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

పారదర్శక పాలనకు నిదర్శనం
శ్రీకాకుళం జిల్లా నందిగాంకు చెందిన ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రాహి టీడీపీ మండల అధ్యక్షుడిగా, కో ఆప్షన్‌ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వృద్ధాప్య పింఛన్‌కు అర్హత పొందడంతో ప్రభుత్వం ఆయనకు పింఛన్‌ మంజూరు చేసింది. స్థానిక సచివాలయం వద్ద ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఆయన పింఛన్‌ అందుకున్నారు. ఆ ఆనందంలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాణిగ్రాహి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు