ముగిసిన దసరా ఉత్సవాలు

25 Oct, 2023 04:58 IST|Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/కోడూరు/పెందుర్తి­/శ్రీశైలం టెంపుల్‌:  ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజున దుర్గమ్మ 2 అలంకారాల్లో అభయమిచ్చారు. ఉదయం మహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా దర్శనాలను నిలిపివేశారు.

2 రోజుల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులకు కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దుర్గాఘాట్‌ వద్ద హంస వాహనంపై శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారు తెప్పపై విహరించారు. 

8.95 లక్షల మందికి దర్శనం  
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15–23 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో 8.95 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 14.17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు చెప్పారు.

స్వర్ణం, వెండి, పట్టుతో నేసిన చీరలో నాంచారమ్మ 
కృష్ణా తీరంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి బంగారం, వెండి, పట్టుతో నేసిన చీరను అలంకరించారు. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ వృత్తి పరంగా విదేశాల్లో స్థిరపడ్డాడు. దసరా ఉత్సవాలకు నాంచారమ్మ అమ్మవారికి రూ.2 లక్షలతో బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను మణికంఠ కుటుంబసభ్యులు సోమవారం ఆలయాధికారులకు అందజేశారు.

పట్టుతో పాటు చీర మొత్తం బంగారం, వెండి తీగలతో నేయించారు. ఈ చీరను మూలమూర్తికి అలంకరించారు. బంగారం, వెండి చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబీకులను ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య సన్మానించారు. 

విశాఖ శ్రీశారదాపీఠంలో..
విశాఖ శ్రీశారదాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భం­గా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధి­కారి స్వాత్మానందేంద్ర సరస్వతిలు శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చిన శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధా­న కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి శ్రీశారదాపీఠాన్ని మంగళవారం సందర్శించి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరి­పారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో..  
శ్రీశైలంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దస­రా మహోత్సవా­లు మంగళవారంతో ముగి­శాయి. అమ్మవారు నిజ­రూప అలంకారంలో భ్రమరాం­బాదేవి­గా దర్శనమి­చ్చా­రు. నంది వాహన సేవ­లో ఆది దంపతులు విహరించారు. ప్రత్యేక అలంకృతులైన అమ్మవారికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక వేదికలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటు శమీ పూజ చేపట్టారు.

అమ్మవారి యాగ­శాలలో, స్వామివారి యాగశాలలో శాస్త్రోక్తం గా పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరిలో దసరా మహోత్సవాలు ముగిశాయి. కాగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు పట్టువ్రస్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు