ఏపీ సహకారంతో ఇథియోపియాలో ఈ–క్రాప్‌

23 Jun, 2023 09:29 IST|Sakshi

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం

వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయిన ఇథియోపియా బృందం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్‌ క్రాపింగ్‌ (ఈ–క్రాప్‌) అద్భుతంగా ఉందని, ఈ సాంకేతికతను తమ దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయింది.

ఈ సందర్భంగా ఏపీలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తమ దేశంలో రైతులకు కూడా అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇథియోపియా ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ–పంట నమోదుతోపాటు యంత్రసేవా పథకం, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ రైతు భరోసా వంటి పథకాలను తమ రైతులకు అందించాలని భావిస్తున్నామన్నారు. వీటి అమలు కోసం అవసరమైన సాంకేతికతను అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఇథియోపియా దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ వెల్లడించారు.

ఎరువులు, పురుగు మందులపై ఆరా
ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలను ఇథియోపియా ప్రతినిధి బృందం ఆరా తీసింది. కాగా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బృందానికి వివరించారు. ఈ–క్రాప్‌ నమోదు, ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్‌పుట్స్‌ పంపిణీ, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్‌హైరింగ్‌ సెంటర్స్‌), డ్రోన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్, వైఎస్సార్‌ అప్లికేషన్‌ సాంకేతికతను, పొలం బడుల ద్వారా గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ అంశాలను వివరించారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌పాండే, వ్యవసాయ శాఖ జేడీ వల్లూరి శ్రీధర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు.

మరిన్ని వార్తలు