‘ఈనాడు’ది ఉత్త ‘కథే’

18 Nov, 2023 05:16 IST|Sakshi

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల మాయ అంటూ తప్పుడు కథనం

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపణలకు వంతపాట

ఒకే డోర్‌ నంబర్‌పై 67 ఓట్లున్నట్లు అబద్ధపు ఆరోపణలు

అవి తప్పని నిరూపించిన నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు

ఆ డోర్‌ నంబర్‌పై ఒక్క ఓటే ఉన్నట్లు నిరూపణ

మరో అపార్ట్‌మెంట్‌ కథా ఇటువంటిదే

సీతమ్మధార (విశాఖ ఉత్తర): అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలపై ఈనాడు రాసిన ‘కథ’. టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు ఓటర్ల జాబితాపై అడ్డగోలు ఆరోపణలు చేయగా..  వాటి ఆధారంగా ఒకే చిరునామాలో పదుల సంఖ్యలో ఓట్లున్నాయంటూ ‘విశాఖ ఉత్తరంలో ఓట్ల మాయ’ పేరుతో ఈనాడులో శుక్రవారం కథనం అచ్చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవాలని నెడ్‌క్యాప్‌ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు క్షేత్రస్థాయిలో నిరూపించారు.

కేకే రాజు ఓటర్ల జాబితా పట్టుకొని ఈనాడులో రాసిన బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని 49–54–8 నంబర్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ యజమానితో మాట్లాడగా 2 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ఇంట్లో రెండు ఓట్లు ఉండగా,  జాబితాలో ఒకే ఓటు ఉందని, మరో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజు చెప్పారు.  అదేవిధంగా 49–54–8/1 ఒక అపార్ట్‌మెంట్, 8/2లో మరో అపార్ట్‌మెంట్‌ ఉన్నాయన్నారు. వాటిలో ఒకటి  శిథిలమైపోవడంతో కూలగొట్టి మళ్లీ కడుతున్నారని, ఈ అపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 27 ఓట్లే ఉన్నాయని తెలిపారు. ఇక్కడ లేని వారు చిరునామా మార్చుకోవాలని బీఎల్‌వోలు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు చెప్పారు.

వాస్తవాలిలా ఉంటే.. టీడీపీ, బీజేపీ నేతలు, విష పత్రిక ఈనాడు నిరాధార కథనాలు రాయడం సిగ్గు చేటని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ నేతలే ఇష్టం వచ్చినట్లుగా ఓట్లని చేర్పించేశారన్నారు. 2019లో  ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 2.80 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా 60 వేల ఓట్లు చేర్పించామంటూ విష్ణుకుమార్‌ రాజు, గంటా ఆరోపిస్తున్నారని, ఇన్ని చేర్పిస్తే 3 లక్షల పైచిలుకు ఓట్లు ఉంటాయన్నారు.

కానీ.. ప్రస్తుత ముసాయిదాలో 2.70 లక్షల ఓట్లే ఉన్నాయని చెప్పారు. 2019లో 72 రోజుల్లోనే టీడీపీ ఇక్కడ వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించిందని తెలిపారు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగిస్తుంటే ఓడిపోతారన్న భయంతో అడ్డగోలు ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టాయని తెలిపారు.

మరిన్ని వార్తలు