Fact Check: తెలియక కాదు.. అతితెలివి!!

8 Dec, 2023 05:10 IST|Sakshi

రైతులను గందరగోళ పరిచేలా రామోజీ కట్టు కథలు

పంటల బీమాపై రహస్యాలంటూ పనికిమాలిన రాతలు

రైతుల వివరాలన్నిటినీ నెల కిందటే కేంద్రానికి పంపిన రాష్ట్రం

రికార్డుల డిజిటలైజేషన్‌ సైతం పూర్తి చేసిన కేంద్రం

ప్రీమియం ఖరారు చేసి చెల్లించేందుకు ఏప్రిల్‌ దాకా సమయం

వచ్చే సీజన్‌ మొదలయ్యేలోగా (జూన్‌) బీమా పరిహారం చెల్లింపు

ఈ వాస్తవాలన్నిటినీ తొక్కిపట్టి ‘ఈనాడు’ దొంగనాటకాలు

రైతులను గందరగోళ పరిచేలా రహస్యమంటూ పిచ్చిరాతలు

రైతులపై రూపాయి భారం పడకుండా బీమా కల్పిస్తున్నది ఇక్కడే

14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఇలాంటి ఆలోచన చేస్తే ఒట్టు

అయినా బాబు హయాంలోనే రామరాజ్యం అన్నట్టుగా రాతలు

2014–19 మధ్య ఐదేళ్లూ కరువు; అయినా బాబు చెల్లించిన బీమా అంతంతే

కేవలం 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్ల చెల్లింపు

2019 నుంచీ ప్రతి ఎకరాకూ ఉచిత బీమాను అమలు చేస్తున్న జగన్‌

దీంతో ఇప్పటికే 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల చెల్లింపు

ఎవరి హయాంలో రైతులు ధీమాగా ఉన్నారో ఈ అంకెలే చెబుతాయి  

సాక్షి, అమరావతి: నూటికి నూరుశాతం రైతులంతా ఈ–క్రాప్‌ చేసుకున్నారు. ఆ జాబితాను అక్టోబరు నెలాఖరు నాటికే... అంటే దాదాపు నెల కిందటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నమోదు కూడా పూర్తయింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందం పరిశీలించి... అనంతరం డేటాను ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పోర్టల్‌లో ప్రదర్శిస్తారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను కూడా నిర్ధారించేది అప్పుడే. దీనికి ఏప్రిల్‌ దాకా సమయం ఉంది. ఇక బీమా చెల్లింపులనేవి వచ్చే సీజన్‌ మొదలయ్యేలోగా... అంటే జూన్‌లోగా జరుగుతాయి. ఇదీ ప్రక్రియ.  

మరి రామోజీరావుకు అంత కంగారెందుకు? రైతులంతా నూటికి నూరుశాతం బీమా ఉందన్న ధీమాతో ఉంటే... రామోజీకెందుకు అంత గుబులు పుడుతోంది? ఎక్కడో కేంద్ర వెబ్‌సైట్లో ‘ఈనాడు’కు డేటా కనిపించకపోతే.. దానిక్కూడా ముఖ్యమంత్రి జగన్‌ను బాధ్యుడిని చేస్తూ దిగజారుడు రాతలు రాస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి?  2023 ఖరీఫ్‌ సీజన్లో ఈ–క్రాప్‌లో ఏకంగా 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలు, సాగు చేసిన 34.70 లక్షల మంది రైతుల పేర్లు కేంద్రానికి ఎప్పుడో చేరాయి. ఆ సంగతి ‘ఈనాడు’కూ తెలుసు. కేంద్ర సాంకేతిక బృందం పరిశీలన పూర్తవకపోవడం వల్ల వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌డేట్‌ కాకపోయి ఉండొచ్చు.

దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంపై బురద జల్లాలనుకుంటున్న రామోజీరావు మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం కేంద్రం ఆ వివరాలను ఇచ్చే వరకూ ఆగే ఓపిక కూడా లేదా? రాష్ట్రంలో రైతులపై రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తున్న విషయాన్ని ఎన్నడైనా ప్రశంసించారా రామోజీ? నష్టపోయిన ప్రతి రైతు ఖాతాకూ నేరుగా బీమా మొత్తం జమవుతుండటాన్ని ఏనాడైనా గ్రహించారా? చంద్రబాబు నాయుడి హయాంలో జరగనివన్నీ ఇపుడు జరుగుతుండటాన్ని ఏనాడైనా గుర్తించారా అసలు? 

అభూత కల్పనలు.. కట్టు కథలతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లటమే ‘ఈనాడు’ పని. రైతులను గందరగోళపరిచి బాబుకు లబ్ధి చేకూర్చే ప్రయత్నమే గురువారం నాటి  ‘ఉచిత బీమాపై జగన్నాటకం!’ కథనం. ఈ క్రాప్‌ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్‌ బీమా కవరేజ్‌తో రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటమంటే సెల్ఫ్‌గోల్‌ కొట్టుకోవటమేనన్న కనీస జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లోపించటమే దారుణం.  

బాబు హయాంలో ఐదేళ్లూ కరువే.. అయినా!! 
చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లూ కరువు తాండవిస్తూనే వచ్చింది. పైపెచ్చు అప్పుడప్పుడూ వచ్చిన అకాల వర్షాలు రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీశాయి. అయినా సరే... ఆ ఐదేళ్లలో చెల్లించిన బీమా పరిహారం కేవలంరూ.3,411 కోట్లు. అది కూడా 30.85 లక్షల మంది రైతులకు. అయితే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకా’న్ని ప్రవేశ పెట్టారు. రైతు జేబు నుంచి పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

నూరుశాతం పంటల్ని ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ.. నమోదైన ప్రతి ఎకరాకూ నష్టపోయిన పక్షంలో బీమా పరిహారం అందిస్తున్నారు. నిజానికి ఈ నాలుగున్నరేళ్లలో పెద్దగా కరువు లేదు. విపత్తులూ తక్కువే. అయినా సరే... ప్రతి ఎకరాకూ కవరేజీ ఉండటంతో ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,802 కోట్ల బీమా పరిహారం అందింది. అంటే బాబు హయాంకన్నా దాదాపు ఒకటిన్నర రెట్లు అధికం. దీన్నిబట్టి బాబు హయాంలో బీమా ఏ స్థాయిలో అందిందో ఊహించుకోవచ్చు. కానీ రామోజీరావు ఎన్నడూ చంద్రబాబును ప్రశ్నించనే లేదు. పైపెచ్చు ఈ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేస్తూ అంతకంతకూ దిగజారిపోతున్నారు. 

ఇంత పారదర్శకంగా ఎక్కడా ఉండదు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి  ప్రతి సీజన్లో నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తున్నారు.  సామాజిక తనిఖీ, గ్రామ సభల అనంతరం ఈ–క్రాప్‌ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. తొలుత డిజిటల్‌ రశీదులో సాగు చేసిన పంట వివరాలను రైతులకు పంపుతారు. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే భౌతిక రశీదులు ఇస్తారు.

ఇందులో ఉచిత పంటల బీమా పథకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్‌ గుర్తుతో) ప్రత్యేకంగా తెలియజేస్తూ సంబంధిత సాగుదారు సంతకంతో ఇస్తారు. ఇందులో ‘డాక్టర్‌ వైస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం’ కింద నోటిఫై చేసిన మీ పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంట బీమా చేయబడినద్ఙి అని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇదీ పారదర్శకత అంటే.  

సర్కారు చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? 
వైఎస్‌ జగన్‌ సర్కారుకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే నోటిఫై చేసిన పంటలకు సాగైన ప్రతి ఎకరాకు బీమా రక్షణ కల్పిస్తోంది. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలోనైనా కనీసం 2 వేల హెక్టార్లకు పైబడి సాగవ్వాలి. ఇది కొత్త నిబంధనేమీ కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వ్యవసాయ సీజన్‌ నుంచి మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది.

గతంలో చంద్రబాబు ఏలుబడిలో ఒకే పంటకు కొన్ని చోట్ల దిగుబడి ఆధారంగా, మరికొన్ని చోట్ల వాతావరణ ఆధారంగా బీమా వర్తింపజేసేవారు. దీంతో ఒకేలా నష్టం వాటిల్లినా పరిహారంలో వ్యత్యాసంతో రైతులకు నష్టం జరిగేది. ఈ పరిస్థితిని చక్కదిద్ది నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. అంతే కాదు.. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.

ఈ సీజన్‌లో జిల్లాలవారీగా కవరేజ్‌ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్‌ పంటల వివరాలు, పూర్తి మార్గదర్శకాలతో ఇటీవలే నోటిఫికేషన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఖరీఫ్‌లో మిరప, పసుపు, జొన్న పంటలకు దిగుబడి ఆదారంగా, పత్తి, వేరుశనగ పంటలకు వాతావరణ ఆధారంగా బీమా కవరేజ్‌ కల్పించారు. అలాగే దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి, పంటలకు వాతావరణ ఆదారంగా బీమా కల్పించగా, కొత్తగా కొన్ని జిల్లాల్లో ఆముదం పంటకు కూడా బీమా రక్షణ కల్పించారు. ఇంతకంటే చిత్తశుద్ధి ఇంకేంకావాలి? 

పొరుగు రాష్ట్రాలు ఏపీ బాట పట్టడం కన్పించదా రామోజీ..! 
రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలన్నింటికీ ఈ క్రాప్‌ ఆధారంగా యూనివర్సల్‌ బీమా కవరేజ్‌ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతిగడించింది. ఉచిత పంటల బీమా పథకంగా జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి అవార్డు కూడా లభించింది.

రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన ఈ అత్యుత్తమ పథకాన్ని మిగతా రాష్ట్రాలూ ఇప్పుడు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీ స్ఫూర్తితో 2023–24 వ్యవసాయ సీజన్‌ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో నోటిఫైడ్‌ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు ఇటీవలే ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రా­లూ ఏపీ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

రైతులకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు? 
చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలోకానీ, విభజన తర్వాత ఏర్పడ్డ ఏపీలో గానీ ఎన్నడూ రైతులకు ఉచిత పంటల బీమా కల్పించాలన్న ఆలోచనే చేయలేదు. అధిక ప్రీమియం చెల్లించాల్సి రావడంతో ఆర్థిక స్థోమత లేక లక్షలాది రైతులు బీమా చేయించుకోలేకపోయేవారు. భారీగా నష్టపోయేవారు. బీమా చేయించుకున్న వారికి కూడా ఏళ్ల తరబడి ఎదురు చూస్తే తప్ప పరిహారం ఇచ్చేవారు కారు. ఏ పంటకు ఎంత పరిహారం వచ్చేదో కూడా దాపరికమే. పైగా ఆయన హయాంలో 6.19 లక్షల మందికి బీమా సొమ్ము ఎగ్గొట్టారు.

ఇలా ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని ౖసైతం చెల్లించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే. బాబు హయాంలో 2014–18 మధ్య 2.32 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్‌ కల్పించగా, 74.4 లక్షల మంది బీమా పరిధిలోకి వచ్చారు. ఈ ప్రభుత్వ పాలనలో 2019–23 మధ్య ఏకంగా 3.97 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలకు, 170.34 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు. అంటే  రైతులను ఆదుకుంటున్నదెవరు? రైతును కుదేలు చేసిందెవరు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ? 

>
మరిన్ని వార్తలు