పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం 

15 Dec, 2023 06:23 IST|Sakshi

మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటాం మరెన్నో సంస్కరణలు తెస్తాం.. 

విద్యార్థులకు మేలు చేస్తాం 

విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వక్రబుద్ధితో లేనివి ఆపాదించి తప్పుడు రాతలు రాస్తున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి పిల్లలు ప్రగతి సాధిస్తుంటే వారి భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలను సహించబోమని హెచ్చరించారు. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే వార్తలు ప్రచురించడం దారుణమైన చర్య అని అన్నారు.

మంత్రి గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లపై ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద పిల్లలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను మెరుగు పరుచుకుని, చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాబ్‌లు అందిస్తోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్‌ అమలు చేసినప్పుడు ఇదే పత్రిక వ్యతిరేక కథనాలు ఇచ్చిందని  చెప్పారు. ప్రభుత్వంపై కోపం ఉంటే మరో రకంగా చూపాలేగానీ, ఇలా పేద పిల్లలపై చూపడం దిగజారిన పాత్రికేయానికి నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్‌లు ఉపయోగించడంలేదా? ట్యాబ్‌లు ఇవ్వొద్దని ఏ తల్లిదండ్రులు కోరారో ఈనాడు చెప్పాలన్నారు.

రామోజీరావు కొడుకు, మనవలు ట్యాబ్‌లు, కంప్యూటర్లు ఉపయోగించాలి గానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఓ వర్గం రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం పేద పిల్లలను బలిచేయాలనుకోవడం ఇదేం పాత్రికేయం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందని అన్నారు. ఈనాడు పనికిమాలిన పత్రికగా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  

అవి బైజూస్‌ ట్యాబ్స్‌ కావు..  ఒక్క రూపాయి ఖర్చు కాలేదు 
ఈనాడు పేర్కొన్నట్టు అవి బైజూస్‌ ట్యాబ్‌లు కావని మంత్రి చెప్పారు. కేవలం బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అప్‌లోడ్‌ చేసి ఇచ్చామని, ఈనెల 21న ఇవ్వనున్న ట్యాబ్స్‌లోనూ ఇదే విధానం పాటించామని తెలిపారు. కంటెంట్‌ కోసం బైజూస్‌కి ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదని, అలాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ట్యాబ్‌ల ఖర్చంతా ప్రభుత్వమే భరించిందన్నారు. పిల్లలకిచ్చిన ట్యాబ్‌లలో ఎడ్యుకేషన్‌ కంటెంట్‌ కాకుండా మరేవీ రాకుండా లాకింగ్‌ సిస్టమ్‌ ఉందని, ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుందన్నారు. ఎక్కడైనా తప్పుగా వినియోగించినా ఆ సమాచారం తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు.  

21న ట్యాబ్‌ల పంపిణీ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4.35 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఐదేళ్ల వారంటీతో గత ఏడాదికంటే మెరుగైన పరిజ్ఞానంతో ఇంటర్మీడియట్‌ వరకు ఉపయోగపడేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు.  

విద్యపై అవగాహన లేని సెలబ్రిటీ పార్టీ 
రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, విద్యా పథకాలపై కనీస అవగాహన లేకుండా సెలబ్రిటీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని జనసేన నాయకులనుద్దేశించి మంత్రి బొత్స అన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలను ఏ ప్రాతిపదికన ప్రభుత్వం అందిస్తుందో కూడా వారికి తెలియడంలేదన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఎవరు రాస్తారో తెలుసుకోకుండా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతున్నారన్నారు.

విద్యా కానుక ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదివితే అందరికీ (42 లక్షలు) అందిస్తామని, అమ్మ ఒడి తల్లుల అకౌంట్‌లో ఒక విద్యార్థికి మాత్రమే జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లల్లో ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ అమల్లోకి వచ్చిందని, ఈ విద్యార్థులు 2025 మార్చిలో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారని వివరించారు.

గత నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు దాదాపు రూ.60 వేల కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇందులో కేంద్రం ఇచ్చింది రూ.6 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఇది కూడా తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాము మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటామని, పేద విద్యార్థులకు ఏటా ట్యాబ్‌లు ఇస్తామని, విద్యా సంస్కరణలు అమలు చేస్తామని, విద్యార్థులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు