100 యూనిట్ల లోపు విద్యుత్తు చార్జీలు ఏపీలోనే చవక

26 Dec, 2021 03:10 IST|Sakshi

100 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువ

పొరుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు, సరఫరా లోపాలు

ఢిల్లీలో రూ. 4.73, అత్యధికంగా రాజస్థాన్‌లో రూ. 8.33

కర్ణాటకలో రూ.8.26, ఒడిశాలో రూ.4.66, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.49

ఒడిశాలో ఒక వినియోగదారుడు నెలకు సగటున చెల్లించేది రూ. 374

మన రాష్ట్రంలో రూ.266 మాత్రమే.. ఇది ఢిల్లీకంటే తక్కువ

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ  నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి జీవన వ్యయాన్ని కూడా తక్కువ ఉండేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పేదలకు తక్కువ చార్జీలతో విద్యుత్తును అందిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకంటే 100 యూనిట్ల లోపు విద్యుత్తు రాష్ట్రంలోనే చవగ్గా ఉంది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, వాటిలో 23 చోట్ల్ల ఏపీ కంటే ఎక్కువగా విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు.

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వారిపై విధిస్తున్న చార్జీలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ దగ్గర్నుంచి కర్ణాటక, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల్లోకంటే ఏపీలోనే తక్కువ ధరలు ఉన్నాయని సీఈఏ నివేదిక తేటతెల్లం చేసింది.

వంద యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగానికి రాష్ట్రంలో యూనిట్‌కు రూ.2.66 మాత్రమే పంపిణి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇదే వినియోగానికి దేశ రాజధాని ఢిల్లీలో రూ. 4.73, అత్యధికంగా రాజస్థాన్‌లో రూ. 8.33 వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో రూ.8.26, ఒడిశాలో రూ.4.66, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.49 వసూలు చేస్తున్నారు. నాలుగైదు రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలితి ప్రాంతాల్లో మాత్రమే మన రాష్ట్రంకంటే స్వల్పంగా తక్కువ చార్జీలు ఉన్నాయి.

వంద యూనిట్ల లోపు వినియోగానికి ఒడిశాలో ఒక వినియోగదారుడు నెలకు సగటున రూ. 374 చెల్లిస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌లో రూ.449, ఢిల్లీలో రూ.473 చెల్లించాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో ఇది కేవలం రూ.266 మాత్రమే. 400 యూనిట్ల వరకు వినియోగించే వినియోగదారుని చార్జీ ఛత్తీస్‌గఢ్‌లో రూ.494.10 ఉంటే ఒడిశాలో రూ.496.60 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది తక్కువగా రూ.491.63గా ఉంది. 

నాణ్యతలోనూ ముందే
విద్యుత్‌ సరఫరా, నాణ్యతలో ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నారు. దేశంలో విద్యుత్‌ సరఫరాలో నాణ్యతపై 20–30 శాతం కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దేశంలో 10 శాతం గృహాలకు ఎక్కువ సార్లు విద్యుత్‌ కోతలు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఇటువంటి ఫిర్యాదులు లేవు. ఒడిశాలో దాదాపు 85 శాతం కుటుంబాలు రోజుకు కనీసం ఒక సారి విద్యుత్‌ కోతను ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇది దాదాపు 84 శాతం.

అదనపు చార్జీలు లేవు
ఏపీలో వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారిపై ఎటువంటి ఫిక్స్‌డ్‌ చార్జీలు లేవు. ఎలక్ట్రికల్‌ డ్యూటీ కూడా 6 పైసలు మాత్రమే. మిగతా చాలా రాష్ట్రాల్లో ఈ రెండూ కూడా ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో రూ.2.75 ఫిక్స్‌డ్‌ చార్జీ, 68 పైసలు ఎలక్రికల్‌ డ్యూటీ వేస్తున్నారు. ఒడిశాలో కూడా 60పైసలు, 16 పైసలు చొప్పున ఈ చార్జీలు కలిపే బిల్లులు వేస్తున్నారు. మన రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించేది పేద ప్రజలే. అందుకే వారిపై అధిక భారం వేయడంలేదు.
– ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌  

మరిన్ని వార్తలు