233 మిలియన్‌ యూనిట్లకు చేరిన విద్యుత్‌ డిమాండ్‌ 

30 Mar, 2022 04:05 IST|Sakshi

పెరిగిన బొగ్గు ధరలతో విద్యుత్‌ ఉత్పత్తి ఆశించినంతగా లేదు

విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ విజ్ఞప్తి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిందని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 207 మిలియన్‌ యూనిట్లుండగా.. ప్రస్తుతం 233 మిలియన్‌ యూనిట్లకు చేరిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టన్ను బొగ్గు ధర రూ.40 వేలకు పైగా ఉండటంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి ఆశించినంతగా లేదని చెప్పారు.

బహిరంగ మార్కెట్‌ నుంచి పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయడానికి యూనిట్‌కు రూ.20  ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల.. ట్రూ అప్‌ చార్జీల రూపంలో వినియోగదారులపై అదనపు భారం పడటమే కాకుండా విద్యుత్‌ సంస్థలకూ కష్టంగా మారుతుందన్నారు. వేసవి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గృహ, పరిశ్రమలు, మాల్స్, వాణిజ్య భవనాల వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు. ఉ.6 నుంచి 9 వరకు, సా.6 నుంచి 10 వరకు వినియోగాన్ని తగ్గించుకోవాలని, పరిశ్రమల్లో పని వేళలను పీక్‌ అవర్స్‌లో కాకుండా మిగతా సమయాలకు సర్దుబాటు చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. 

మరిన్ని వార్తలు