భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం 

1 Oct, 2023 05:51 IST|Sakshi

సెప్టెంబర్‌లో ఐదేళ్ల గరిష్టానికి.. 

రాష్ట్రంలోనూ రికార్డుస్థాయిలో డిమాండ్‌ నమోదు 

2019లో 4,855.8 మిలియన్‌ యూనిట్లుకాగా ఇప్పుడు 6,550.2 మిలియన్‌ యూనిట్లు 

218.34 మిలియన్‌ యూనిట్లుగా రోజువారీ సగటు డిమాండ్‌ 

విదేశీ బొగ్గు దిగుమతికి 2024 మార్చి వరకు గడువు పొడిగించిన కేంద్రం 

సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్‌ నెల విద్యుత్‌ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్‌తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్‌ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్‌ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్‌ 161.86 మిలియన్‌ యూనిట్లుగా ఉంది.

అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్‌ 6,550.2 మిలియన్‌ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్‌ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్‌ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్‌ యూనిట్లు పెరిగింది. విద్యుత్‌ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్‌ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్‌ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృ­ద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.  

విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. 
దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ 142 బిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి విద్యుత్‌ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్‌ మార్కెట్లో తరచుగా విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.9.60 ఉండగా సెప్టెంబర్‌లో యూనిట్‌ రూ.9.37గా ఉంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. 

మరిన్ని వార్తలు