ఏపీ బాటలో కర్ణాటక 

27 Dec, 2023 04:50 IST|Sakshi
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పిక్టోరియల్‌ డిక్షనరీ

తమ విద్యార్థులకు కూడా పిక్టోరియల్‌ డిక్షనరీలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

ఏపీ ఎస్సీఈఆర్టీ సహకారంతో డిక్షనరీల రూపకల్పన 

కర్ణాటక అధికారులను ఆకర్షించిన ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన పిక్టోరియల్‌(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్‌ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది.  

పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. 
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్‌–తెలుగు పిక్టోరియల్‌ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్‌ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్‌ ఏ వర్డ్‌’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్‌ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు.  

పూర్తి శాస్త్రీయంగా తయారీ 
ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్‌ నేర్చుకునేలా తగిన  చర్యలు తీసు­కు­న్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్‌ డిక్షనరీని ఇంగ్లిష్‌–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం.      – డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ 

>
మరిన్ని వార్తలు