ఇక పాకెట్‌లోనే డేటా వ్యాలెట్‌!

27 Dec, 2023 05:32 IST|Sakshi

వ్యాలెట్‌లో క్రెడిట్‌ కార్డు తరహాలో భారీ డేటా బ్యాంకు

150 ఏళ్ల పాటు భద్రం..  వైరస్‌ల బెడదా ఉండదు

ఫలిస్తున్న ఫ్రాన్స్‌ స్టార్టప్‌ కంపెనీ బయోమెమురీ ప్రయోగాలు

ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాకప్‌ పొందే వీలు

సైబర్‌ దాడులు జరిగినా సమాచారం చెక్కు చెదరదు

వెయ్యి డాలర్ల ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు

కేజీ రాఘవేంద్రారెడ్డి  (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : 
♦ ప్రతి వ్యక్తి సగటున రోజుకు 3.5 గిగాబైట్స్‌ (జీబీ)ని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

♦ 2021 నాటి గణాంకాల ప్రకారం.. రోజూ 2.5 క్విన్‌ టిలియన్‌ (18 జీరోలు) డేటా ఉత్పత్తి అవుతోంది.

..ఇలా ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మనకు ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. దాని నుంచి పొందిన డేటాను భద్రపర్చడం, అవసరమైనప్పుడు తిరిగి అందుబాటులోకి తేవడం కష్టంగా మారుతోంది. మూడు దశాబ్దాల క్రితం మెమొరీ స్టోరేజ్‌.. ఫ్లాపీతో మొదలైంది. ఆ తర్వాత సీడీ, డీవీడీ, మెమొరీ కార్డు, పెన్‌ డ్రైవ్‌ ఇలా విభిన్న రూపాలను సంతరించుకుంది.

ఈ కోవలో ఇప్పుడు డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి కూడా భారీ స్థలం, వ్యయం, అధిక విద్యుత్‌ వినియోగం అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన బయోమెమొరీ అనే ఒక స్టార్టప్‌ సంస్థ.. డీఎన్‌ఏ డిజిటల్‌ డేటా స్టోరేజీ విధానంపై పలు పరిశోధనలు చేసింది. మన ప్యాకెట్‌లో పట్టే వ్యాలెట్‌ సైజులో ఉంచుకునే క్రెడిట్‌ కార్డు తరహాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

వ్యాలెట్‌ సైజులోనే..
ఇకపై సొంత డేటా, కంపెనీ డేటా.. ఇలా ఏదైనా ఇక ఏ డేటా సెంటర్‌ నుంచో బ్యాకప్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ సీఈవో మీరే అయితే.. సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారం మీ జేబులో ఉంచుకునే రోజులు రాబోతున్నాయి. కొత్త తరహా డేటా సెంటర్లను అభివృద్ధి చేసే ప్రక్రియపై బయో మెమొరీ స్టార్టప్‌ సంస్థ ప్రయోగాలు దాదాపు సఫలీకృతమయ్యాయి. సుమారు వెయ్యి డాలర్ల ధరకే ఈ డీఎన్‌ఏ డేటా స్టోరేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.

150 ఏళ్లపాటు సురక్షితం..
కేవలం డేటా స్టోరేజీ విషయంలోనే కాకుండా.. భద్రంగా దాచుకునేందుకు కూడా ఈ డీఎన్‌ఏ డేటా ఉపయుక్తం కానుంది. వాస్తవానికి హార్డ్‌ డిస్క్‌లకు 5 ఏళ్లు, ఫ్లాష్‌ డ్రైవ్స్‌కు 10 ఏళ్ల మన్నిక ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యాలెట్‌ సైజులో ఉండే డేటా బ్యాంకు 150 ఏళ్ల పాటు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా వైరస్‌ల బెడద కూడా ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను బ్యాకప్‌ చేసుకోవచ్చు. ఇతరులెవరూ దీన్ని యాక్సిస్‌ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాలు, సైబర్‌ దాడులు జరిగినప్పుడు కూడా సమాచారం చెక్కుచెదరకుండా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. ఎంత పెద్ద డేటానైనా కేవలం నానో సెకన్లలోనే చెక్‌ చేసుకునే సదుపాయం కూడా ఈ డీఎన్‌ఏ డేటా బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుంది.

డేటా సెంటర్ల కేంద్రంగా.. విశాఖ
ఇంటర్నెట్‌ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విశాఖపట్నంలోనూ ఏర్పాటు కాను­న్నాయి. ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. రూ.21,844 కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ ఆదానీ సైతం డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఓవైపు.. డేటా సెంటర్ల ఏర్పాటులో ఆయా దేశాలు పోటీపడుతుండగా.. బయోమెమొరీ స్టార్టప్‌ సంస్థ చేస్తున్న ప్రయోగా­లతో వ్యాలెట్‌ రూపంలో డేటా బ్యాంక్‌ మార్కెట్‌లోకి వస్తే సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయమంటున్నారు.

భారత్‌లో భారీ డేటా సెంటర్లు..
ప్రస్తుతం హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్స్‌ ఆపరేషన్స్‌ జరుగుతున్న దేశాల్లో 44 శాతంతో యూఎస్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. చైనా 8 శాతం, జపాన్, యూకే 6 శాతం చొప్పున, ఆస్ట్రేలియా, జర్మనీ 5 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా భారత్‌లోనూ అడుగులు పడుతున్నాయి. మొత్తం డేటా ట్రాఫిక్‌ 2025 నాటికి నెలకు 7 ఎక్సాబైట్స్‌ నుంచి 21 ఎక్సాబైట్స్‌కు పెరుగుతుందని ఒక అంచనా.

డేటా వ్యాపారం 2022లో 4.9 బిలియన్‌ డాలర్లుండగా.. 2027 నాటికి ఇది 10.09 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. 25 ఎకరాల స్థలంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింప్రీలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అమెజాన్, గూగుల్‌ సైతం డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు