మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి 

20 Dec, 2021 04:31 IST|Sakshi
జిల్లా పరిషత్‌ తొలి సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి, చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

విశాఖ జెడ్పీ సమావేశంలో తీర్మానం 

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానం

ఆమోదించిన సభ్యులు   

మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పాలకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారి ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశం చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. మూడు రాజధానులపై తీర్మానం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రతిపాదించగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సభ్యులంతా ఆమోదించారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అన్నారు.

అలాగే విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి సమావేశంలో ఏడు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మొదటి స్థాయి సంఘంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏడో స్థాయి సంఘంలో మంత్రి ముత్తంశెట్టి సభ్యులుగా ఎన్నికైనట్టు చైర్‌పర్సన్‌ సుభద్ర ప్రకటించారు. మాజీ సీఎం రోశయ్య, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ బిపిన్‌ రావత్, విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సభ సంతాపం తెలిపింది. 

మరిన్ని వార్తలు