పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఏర్పాటు

16 Mar, 2021 04:22 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రావిురెడ్డి

సాక్షి, అమరావతి/బస్‌స్టేషన్‌ (విజయవాడ వెస్ట్‌):  దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులు ఒకే సంఘంగా ఏర్పడి ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌’ ఆవిర్భావానికి నాంది పలికారు. సోమవారం ఆర్టీసీ క్లాంపెక్స్‌లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి నేతృత్వంలో అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు.

ఎంపీడీవో అసోసియేషన్, ఈవోపీఆర్‌డీ ఉద్యోగుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ స్టాఫ్‌ అసోసియేషన్, ఏపీ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం, ఏపీపీఆర్‌ ఇంజనీరింగ్‌ మినిస్టీరియల్‌ స్టాఫ్‌ అసోసియేషన్, ఏపీ పీఆర్‌ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, ఏపీ డీఎల్‌డీవో అసోసియేషన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడుగా వెంకట్రావిురెడ్డిని, అధ్యక్షుడిగా కె. శ్రీనివాసరెడ్డిని,  ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌ను, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా వైవీడీ ప్రసాద్‌ను, కన్వీనర్‌గా జె.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. 

జాయింట్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం దక్కేలా..
పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటిపై లేకపోవడం వలన ప్రభుత్వ ఉద్యోగుల విధానపరమైన నిర్ణయాల్లో వీరి భాగస్వామ్యం లేకుండా పోయిందని అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి అన్నారు. అసోషియేషన్‌ ఏర్పాటుపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక అయిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో అసోసియేషన్‌ సభ్యత్వం పొందే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు