ఐఓసీ పెట్రోల్‌ బంకుల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

13 May, 2022 18:50 IST|Sakshi
నందిగామ ఐఓసీ బంకు (ఇన్‌సెట్‌లో) ఈ బంకులో ఏర్పాటు చేసిన ఈ–చార్జింగ్‌ పాయింట్‌

బస్‌స్టేషన్ల వద్ద ఏర్పాటుకు చర్యలు

ఉమ్మడి కృష్ణాలో 16 ప్రాంతాలు ఎంపిక 

ఇప్పటికే 11 ఐఓసీ బంకుల్లో చార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు

సాక్షి, అమరావతి బ్యూరో: పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఈ ధరలు వాహనాల యజమానులకు కొండంత భారంగా మారాయి. ఈ తరుణంలో పెట్రోల్, డీజిల్‌తో పనిలేని ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈ–వాహనాలు)  అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వాహనాలకు సరిపడినన్ని చార్జింగ్‌ స్టేషన్లు లేక వాటి కొనుగోలుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) దృష్టి సారించింది. ఈ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగనుంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్‌ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు చెందిన 11 పెట్రోల్‌ బంకుల్లో 25, 30, 50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. మూడు స్టేషన్లకు విద్యుత్‌ (గ్రిడ్‌) కనెక్షన్‌ కూడా ఇవ్వడంతో అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన వాటికి త్వరలో కనెక్షన్‌ ఇవ్వనున్నారు.

ఆర్టీసీ బస్టాండ్లలో.. 
కొత్తగా ఆర్టీసీ బస్టాండ్లలో ఈ–చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టేషన్, ఆటోనగర్, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, ఎ.కొండూరు, ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, చందర్ల పాడు, గన్నవరం, కైకలూరును ఎంపిక చేశారు.

ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్‌ స్టేషను/డిపో/బస్టాండ్లలో వాహనాల చార్జింగ్‌కు అనువుగా ఉండే స్థలాలను ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్టు నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ జె.వి.ఎల్‌.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అవి ఖరారైతే ఆయా చోట్ల  చార్జింగ్‌ పాయింట్లను అమర్చనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నాలుగు, మూడు చక్రాల విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ పెట్టుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాహనదారులు తమ వాహనానికి చార్జింగ్‌ అయిపోతే సమీపంలో చార్జింగ్‌ స్టేషన్‌/పాయింట్‌ ఎక్కడుందో తెలుసుకునే ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. (క్లిక్: కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు)

మరిన్ని వార్తలు