సహాయ, పునరుద్ధరణ చర్యలు వేగవంతం

8 Dec, 2023 04:56 IST|Sakshi

నిత్యావసర సేవలన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించండి

జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపానువల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనాలను త్వరగా  చేపట్టడంతో పాటు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను అనంతర సహాయ, పునరుద్ధరణ చర్యలపై గురువారం రాష్ట్ర సచి­వాలయం నుంచి∙ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమా­వేశం నిర్వహించారు.

తుపాను అనంతరం విద్యుత్, రహదా­రులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పంటనష్టం అంచనాకు సంబంధించి ఎన్యూ­మ­రేషన్‌ ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ­లతో పాటు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో తుపాను నష్ట పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభు­త్వానికి లేఖ రాస్తామన్నారు. 

1.45 లక్షల హెక్టార్లలో వరి పంటకు దెబ్బ
ప్రాథమిక అంచనా ప్రకారం.. 1,45,795 హె­క్టా­ర్లలో వరి, 31,498 హెక్టార్లలో వివిధ ఉద్యా­న పంటలు దెబ్బతిన్నాయని జవహర్‌­రెడ్డి తెలిపారు. ఎన్యూమరేషన్‌ ప్రక్రియ పూర్తికా­గానే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింపజేస్తామని ఆయన స్పష్టంచేశారు. అలాగే.. తడిసిన, రంగు మారిన ధాన్యం సేకరణకు సంబంధించిన నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు  సీఎస్‌ చెప్పారు.

శిబిరాల్లో చేరిన వారికి సాయం..
♦ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి. సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పునరావాస కేంద్రాల్లో చేరిన వారికి మొత్తం సుమారు రూ.రెండున్నర కోట్ల వరకూ సహాయం అందించినట్లు తెలిపారు. 
♦1,01,000 కుటుంబాలకుగాను ఇప్పటికే 65,256 కుటుంబాలకు 25 కిలోలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేశామన్నారు. మిగతా కుటుంబాలకు కూడా త్వరగా అందిస్తామన్నారు. 
♦ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ 3,292 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగ్గా ఇప్పటికే 3,111 గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించామని చెప్పారు.

11 నుంచి పంట నష్టం అంచనా..
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి∙పంట నష్టం అంచనా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పశు సంపద, బోట్లు, వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యూమరేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి  నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

93.8 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయని వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ చెప్పారు. ఆర్‌ అండ్‌ బి  కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ 2,816 కిమీ మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని సమీప మార్కెట్‌ యార్డులు, గోదాములకు తరలించి కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు