సాధారణ స్థితికి విద్యుత్‌ సరఫరా

8 Dec, 2023 04:52 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిరంతర విద్యుత్‌

సాక్షి, అమరావతి/కాకినాడ/­మొగల్రాజ­పురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభా­విత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా సాధా­రణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతి­పదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యు­త్‌ను పునరుద్ధరించారు. దీంతో గురువా­రం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు.

మిచాంగ్‌ తీవ్రత ఎక్కు­వగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లా­ల్లోనూ విద్యుత్‌ సరఫరాను సాధా­రణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ నిరంతరం పర్యవేక్షిస్తు­న్నారు. 

పూర్తయిన పునరుద్ధరణ..
ఏపీఎస్పీడీసీఎల్‌లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్‌లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

నెల్లూరు సర్కిల్‌లో 33/11కేవి సబ్‌­స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజ­మండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్‌స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్‌ 16, 11కేవీ పోల్స్‌ 514, 173 డీటీఆర్‌లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు.

డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్‌ 1,247, డీటీఆర్‌లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు  అంచనా వేశారు.

>
మరిన్ని వార్తలు