టెన్త్‌ ఫెయిలైన 88,342 మంది  తిరిగి బడికి..

16 Oct, 2023 06:08 IST|Sakshi

ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. అందుకే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. పలు సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్‌రోల్‌ చేయించి తరగతులకు పంపడం.

వారు పదో తరగతి ఫెయిలైన తర్వాత చదువు మానేయకుండా ఈ చర్యలు చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుంది. దీంతో వారిని తిరిగి తరగతులకు పంపుతున్నారు. తిరిగి పదో తరగతిలో చేరిన వారికి విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1.23,680  మంది విద్యార్థులు టెన్త్‌ ఫెయిలయ్యారు.

వారు తిరిగి స్కూల్స్‌లో చేరారా లేదా అనే  వివరాలన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వం సేకరించింది. వారిలో 88,342 మందిని ఇప్పటివరకు తిరిగి పదో తరగతిలో ఎన్‌రోల్‌ చేయించింది. ఇప్పుడు ఈ విద్యార్థులంతా తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమీక్షించారు.

అదనంగా చేరికలు
గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 1,26,212 మంది అదనంగా చేరారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్‌లో 6,64,511 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 7,90,723 మంది ఎన్‌రోల్‌ అయ్యారు. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డిగ్రీ వరకు చదివేలా సూక్ష్మస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు.

పాస్‌ అయిన విద్యార్ధులు అంతటితో చదువు ఆపేయకుండా తదుపరి కోర్సుల్లో చేరుతున్నారా లేదా అనే వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో సేకరిస్తోంది. చదువు ఆపేసిన వారిని పై తరగతుల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి పేద విద్యార్ధి ఆరి్థక స్థోమత లేక మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా రాస్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు కార్యక్రమాలన్నీ విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే పథకాలే. 
 

మరిన్ని వార్తలు