అడ్డాకులకు అదిరే ధర

31 May, 2022 23:46 IST|Sakshi
వారపు సంతకు అడ్డాకులను తీసుకువెళ్తున్న గిరిజనులు

రెండు దిండ్లు రూ.1800 నుంచి రూ.2 వేలకు విక్రయం 

వారపు సంతల్లో ఊపందుకున్న కొనుగోళ్లు 

గిరి రైతుకు కలిసొచ్చిన సీజన్‌ 

ప్టాస్టిక్‌ నిషేధ నేపథ్యంలో పెరుగుతున్న  ఆదాయం

సాక్షి,పాడేరు : ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఉన్న అడ్డాకుల సేకరణతో గిరిజన రైతులు పూర్వం నుంచి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి అడ్డాకులకు డిమాండ్‌ నెలకొనడంతో వ్యాపారులు గిరిజనుల నుంచి  పోటీపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో వారపు సంతలో కనీసం రూ.3 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది.

రెండు దిండ్లు అడ్డాకులు రూ.1800 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు.  పాడేరు డివిజన్‌ పరిధిలో సుంకరమెట్ట, అరకు, కించుమండ, హుకుంపేట, జి.మాడుగుల, వంట్లమామిడి, మద్దిగరువు, తాజంగి, అన్నవరం, చింతపల్లి, లోతుగెడ్డ వారపుసంతల్లో రెండు వారాల నుంచి అడ్డాకుల వ్యాపారం భారీగా జరుగుతోంది.  

మైదాన ప్రాంత వ్యాపారులు.. 
ఏజెన్సీలో వారపు సంతల్లో నర్సీపట్నం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, ఎస్‌.కోట, విజయనగరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులంతా పోటా పోటీగానే అడ్డాకులను కొనుగోలు చేస్తుండటంతో గిరిజనులకు మంచి ధర లభిస్తోంది.  ఈ ఆదివారం పాడేరు మండలం వంట్లమామిడి, అరకులోయ మండలం సుంకరమెట్ట వారపుసంతల్లో అడ్డాకుల వ్యాపారం భారీగానే జరిగింది. ఈ రెండు సంతల్లోను కనీసం రూ.8లక్షల మేర విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.  

వందలాది కుటుంబాలకు ఉపాధి ఏజెన్సీలోని గిరిజన రైతుల వద్ద 
సీజన్‌లో రూ.20 నుంచి రూ.30 వేలకు పైగా ఆదాయం సీజన్‌ ముగిసే లోపు ఒక్కో కుటుంబం కనీసం రూ.20వేల నుంచి 30వేల వరకు అడ్డాకుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. గతంలో గిరిజన సహకార సంస్థ అడ్డాకులను కిలోల రూపంలో కొనుగోలు చేసేది.

అడ్డాకుల వినియోగం అప్పట్లో తగ్గడం, ప్రైవేటు వ్యాపారుల నుంచి ఆదరణ కరువవడంతో పదేళ్ల నుంచి అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడంతో అడ్డాకులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. 

గిరి రైతులకు అడ్డాకులు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెటఖ పరిస్థితులు కలిసి రావ డంతో రెండేళ్ల నుంచి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో గిరిజనులకు ఊహించని ధర లభించింది. దీనికి తోడు ప్లాస్టిక్‌ వినియోగం తగ్గుతుండటంతో ఆదాయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు