ఫాస్టాగ్‌ యూజర్లు 57 శాతమే!

13 Dec, 2020 05:00 IST|Sakshi

జనవరి 1 నుంచి టోల్‌గేట్లు దాటే వాహనాలకు తప్పనిసరి

సాక్షి, అమరావతి: ఏపీలో ప్రస్తుతం ఫాస్టాగ్‌ యూజర్లు 57 శాతం వరకు ఉన్నట్టు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అంచనా వేస్తోంది. టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ లైన్‌ ద్వారా ప్రస్తుతం 50 నుంచి 57 శాతం వాహనాలు మాత్రమే వెళుతున్నట్టు లెక్కగట్టింది. ఈ నెలాఖరు నాటికి 90 శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ ఉండేలా.. టోల్‌గేట్ల వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్‌ స్టిక్కర్లను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి అన్ని టోల్‌గేట్లలో ఫాస్టాగ్‌ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచి నగదు చెల్లించే లైన్లను తొలగించాలంటూ టోల్‌ ప్లాజాల నిర్వాహకులకు ఆదేశాలందాయి. ఏ వాహనమైనా ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌గేట్ల వద్దకు వస్తే.. వెనక్కి పంపిస్తారు. మొండికేసి ముందుకు వెళ్దామంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. మరోవైపు ఫాస్టాగ్‌ ఉంటేనే రవాణా వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని రవాణా శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. 

ఫాస్టాగ్‌ అంటే..
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ)తో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్‌ అంటారు. 2014లోనే ఫాస్టాగ్‌ విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ అమల్లోకి తెచ్చింది. వాహనాలకు అతికించి ఉండే ఈ స్టిక్కర్‌పై గల బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్‌ఎఫ్‌ ఐడీ యంత్రం రీడ్‌ చేస్తుంది. వాహనం టోల్‌ ప్లాజా దాటుతున్నప్పుడు టోల్‌ ఫీజును సం బంధిత వాహన యజమాని ఫాస్టాగ్‌కు రీచార్జి చేయించుకున్న మొత్తం నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటుంది. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానించిన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ‘వన్‌ నేషన్‌.. వన్‌ ట్యాగ్‌’ కింద అన్ని టోల్‌గేట్లలో ఫాస్టాగ్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం రూ.వందతో ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ పొందవచ్చు.

రాష్ట్ర రహదారులపైనా.. 
స్టేట్‌ హైవేస్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్‌ అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. టోల్‌గేట్లలో ఆర్‌ఎఫ్‌ ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ భరిస్తుంది.

ఇవీ ఉపయోగాలు
► ఇంధనం, టోల్‌గేట్ల వద్ద వేచి ఉండే సమయం ఆదా అవుతాయి.
► పొల్యూషన్‌ తగ్గుతుంది. ట్రాఫిక్‌ సమస్యలుండవు.
► ఫాస్టాగ్‌ ఉన్న వాహనం చోరీ అయితే.. ఆ వాహనం టోల్‌ప్లాజా దాటితే ఎక్కడ దాటిందో.. ఏ సమయంలో దాటిందో ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వాహనాన్ని కనిపెట్టే ఆస్కారం కలుగుతుంది.
► టోల్‌ ఫీజుల వసూళ్లు క్యాష్‌లెస్‌ విధానంలో సాగటం వల్ల వాహనదారునికీ ఇబ్బందులు తప్పుతాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు