వి‘హంగామా’.. విదేశీ పక్షులతో ‘తేలుకుంచి’ పులకింత 

4 Sep, 2022 08:23 IST|Sakshi
తేలుకుంచి గ్రామంలోని చెట్లపై విదేశీ పక్షులు

సాక్షి, శ్రీకాకుళం: పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా.. అన్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. మేఘాల పల్లకిలో వేల కిలోమీటర్లు అలుపూ సొలుపు లేకుండా పయనించి అబ్బురపరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై సందడి చేస్తున్నాయి.   

ఇవీ ప్రత్యేకతలు.. 
చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి 2 నుంచి 6 గుడ్లు వరకు పెడుతుంటాయి. 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లు పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి గానీ, మగ పక్షి గానీ గుళ్లలో కాపలాగా ఉంటాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వస్తోన్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు).

శాస్త్రీయ నామం ‘అనస్థోమస్‌’. తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. 6 నెలల పాటు పిల్లలతో గడిపిన పక్షులు పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరిలో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి.


మోడువారిన చెట్లపై నివసిస్తున్న పక్షులు  

ఆడపడుచుల్లా విదేశీ పక్షులు..  
ఈ పక్షులను తేలుకుంచి గ్రామస్తులు తమ ఆడపడుచుల్లాగా భావిస్తుంటారు. గ్రామస్తులకు వాటితో విడదీయరాని అనుబంధం ఉంది. సకాలంలో పక్షులు గ్రామానికి చేరకపోతే ఇక్కడి ప్రజలు ఆందోళనపడుతుంటారు. ఏటా జూన్‌లో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మకం. వీటి రాకతో తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. తాము కూర్చున్న చోట పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎటువంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారినుంచి తామే రక్షిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తారు. తిత్లీ, పైలాన్‌ తుఫాన్‌ తీవ్రతకు చెట్లు నేలకొరగడంతో విహంగాలకు తేలుకుంచిలో విడిదిలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40% తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారినపడి పక్షులు మృతి చెందుతున్నాయి. పక్షులను సంరక్షించేందుకు గ్రామంలో చెట్లు పెంచాలని అధికారులకు తేలుకుంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు