పక్షులను చూస్తున్నంతసేపూ శుభ సమయమే! అదే ఆమెను..

15 Nov, 2023 09:42 IST|Sakshi

పచ్చటి ఊరు వదిలి కాంక్రీట్‌ జంగిల్‌లోకి అడుగుపెట్టిన శుభా భట్‌కు బెంగళూరులోని ‘ఐఐఎస్‌సీ’ క్యాంపస్‌ రూపంలో ప్రకృతి ప్రపంచం దగ్గరైంది. ఎన్నో పక్షులు నేస్తాలు అయ్యాయి. ‘పక్షులను ప్రేమించడానికి వాటి శాస్త్రీయ నామాలతో పనిలేదు’ అని హాస్యానికి అన్నా శుభాభట్‌ విషయంలో అది నిజం. ఎన్నో పక్షులకు సంబంధించి శాస్త్రీయ నామాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోయినా వాటిని ప్రేమించింది. పక్షులను చూస్తున్నంతసేపూ తనకు శుభ సమయమే. శాస్త్రీయ కోణం కంటే అనుభూతులు, భావోద్వేగాల కోణంలో రెండు వందల జాతుల పక్షులకు సంబంధించి తన పరిశీలనలను ‘పక్షి జల’ పేరుతో ఫొటో డాక్యుమెంటేషన్‌ చేసింది శుభా భట్‌...

పెళ్లయిన తరువాత బెంగళూరు మహానగరంలోకి అడుగు పెట్టింది శుభా భట్‌. పచ్చని పల్లెటూరి నుంచి వచ్చిన తనకు వాహనాల రణగొణధ్వనులు తప్ప పక్షుల కిలకిలారావాలేవీ వినిపించేవి కాదు. దీంతో ఇంటి నాలుగు గోడల మధ్య నేషనల్‌ జాగ్రఫీ చానల్‌ చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) క్యాంపస్‌లోకి అడుగు పెట్టడం మళ్లీ పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించింది శుభా భట్‌కు. ఆమె భర్త నవకాంత్‌ భట్‌ పరిశోధకుడు.

ఐఐఎస్‌సీ క్యాంపస్‌లోకి ఎన్నో పక్షులు వచ్చిపోతుంటాయి. వాటిలో ఎప్పుడూ వచ్చే పక్షులతో పాటు అరుదైన అతిథుల్లాంటి పక్షులు కూడా ఉంటాయి. దాహార్తితో ఉన్న పక్షుల కోసం తన ఇంటిముందు మట్టిపాత్రలో నీళ్లు పెట్టి దూరంగా కూర్చునేది. దురదృష్టవశాత్తు ఒక్క పక్షి కూడా వచ్చేది కాదు. క్యాంపస్‌లోనే మరో చోటికి మకాం మార్చినప్పుడు కూడా ఇంటిముందు మట్టి పాత్రలలో నీళ్లు పెట్టి కూర్చొనేది.

ఈసారి మాత్రం అదృష్టం తలుపు తట్టింది. కాకులు, పిచ్చుకలు... రకరకాల పక్షులు వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. ఈ ఉత్సాహంతో మరిన్ని మట్టిపాత్రలు ఇంటి చుట్టూ పెట్టేది. పేరు తెలిసిన పక్షులతో పాటు బొత్తిగా అపరిచితమైన పక్షులూ వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. అవి నీళ్లు తాగే దృశ్యం శుభకు అపురూపంగా అనిపించేది. నీటికి, పక్షులకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేసేది. ఒకరోజు ఒక పక్షి చెట్టు కొమ్మల్లో నుంచి రాలిపడుతున్న నీటిబిందువులలో ఆనందంగా జలకాలాడుతున్న దృశ్యం చూసిన తరువాత చెట్లపై కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకుంది. 

మొత్తానికైతే శుభ ఉండే ఇల్లు పక్షులకు నచ్చిన ఇల్లు అయింది. ‘ఇక్కడకి వస్తే మనకు ప్రమాదమేమీ లేదు’ అనే నమ్మకం వాటికి కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన అరుదైన కశ్మీర్‌ ఫ్లైక్యాచర్‌ శుభ కంటపడింది. కర్ణాటక గడ్డపై అరుదైన కశ్మీర్‌ పక్షిని వీడియో రికార్డ్‌ చేసిన ఘనత దక్కించుకుంది శుభ. ఫొటోగ్రాఫర్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు శుభ. అయితే రకరకాల పక్షులు నీళ్లు తాగుతున్న అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్న రోజుల్లో కెమెరాను చేతుల్లోకి తీసుకుంది. ‘పక్షి జల’ పుస్తకంతో రచయిత్రిగా కూడా మారింది. ఈ పుస్తకాన్ని ఐఐఎస్‌సీ ప్రెస్‌ ప్రచురించింది.

‘పుస్తకం రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాటనీ, బయోలజీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి రాకపోయినా ఈ పుస్తకం రాశానంటే కారణం ప్రకృతిపై నాకు ఉన్న ప్రేమ. దీంట్లో నా పరిశీలనలు, భావాలు, అనుభవాలు కనిపిస్తాయి. పక్షి జల చదివిన వాళ్లు ఎవరైనా తమ ఇంటి పరిసరాలలో పక్షుల దాహార్తిని తీర్చడానికి, వాటి జలకేళిని దర్శించడానికి నీటితో నిండిన మట్టిపాత్రలు ఏర్పాటు చేస్తే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే’ అంటుంది శుభ. మనది కాని ప్రపంచంలోకి తొంగిచూడాలంటే అద్భుతశక్తులేవీ అవసరం లేకపోవచ్చుగానీ ఆసక్తి మాత్రం ఉండాలి. శుభా భట్‌కు ఆసక్తి అనే శక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెని పక్షుల ప్రపంచంలోకి వెళ్లేలా చేసింది.

(చదవండి: పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం, విదేశాల నుంచి వస్తుంటాయి)

మరిన్ని వార్తలు