Sri Sathya Sai: రేసులో దూసుకెళ్దాం.. చకాచకా ఎస్‌–3 ట్రాక్‌ పనులు..

16 Apr, 2022 09:00 IST|Sakshi

కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ 

ఒప్పందంతో సరిపెట్టిన చంద్రబాబు సర్కారు 

భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన జగన్‌ సర్కారు 

చకచకా సాగుతున్న ఎస్‌–3 ట్రాక్‌ పనులు 

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్టు

రయ్యిమంటూ ట్రాక్‌పై దూసుకెళ్తూ క్షణాల్లో మాయమయ్యే కార్లు... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సాగే రేస్‌లో డ్రైవర్ల విన్యాసాలు.. అనుకోని మలుపులు.. ఆపై విజేతల గెలుపు సంబరాలు. టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు లేదను కుంటున్నారా..?, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆ అవకాశం మనకూ కల్పిస్తోంది. చంద్రబాబు హయాంలో అటకెక్కిన ఫార్ములా–3 కార్‌ రేస్‌ ట్రాక్‌ ప్రాజెక్టుకు ఊపిరి పోసింది. ఫలితంగా తనకల్లు మండలం కోటపల్లి వద్ద పనులు చకచకా సాగుతున్నాయి.  

సాక్షి, కదిరి: తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ ఏర్పాటుకు బెంగళూరుకు చెందిన ‘నిధి మార్క్‌ వన్‌ మోటార్స్‌’ ముందుకు వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కంపెనీతో 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. 90 నెలల్లో పనులు పూర్తి చేయాలని అగ్రిమెంట్‌ రాసుకుంది. అయితే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో బాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కారు రేస్‌ ట్రాక్‌ పనులు అటకెక్కాయి. వైఎస్‌ జగన్‌ సర్కారు అధికారంలోకి రాగానే ఈ కారు రేస్‌ ట్రాక్‌ ఏర్పాటుపై దృష్టి సారించింది. 3.4 కి.మీ ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ ఏర్పాటుకు అవసరమైన 219 ఎకరాల భూమిని సేకరించి ‘నిధి మార్క్‌ వన్‌ మోటార్స్‌’కు అప్పగించడంతో పాటు నిర్వాసిత రైతులకు పరిహారం కూడా చెల్లించింది.
 
దేశంలో మూడోది.. ఏపీలో మొదటిది.. 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గ్రేటర్‌ నోయిడా వద్ద ‘బుద్ద ఇంటర్‌ నేషనల్‌ సర్క్యూట్‌’ ఫార్ములా–1 కారు రేస్‌ ట్రాక్‌ ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొట్టయ్‌ వద్ద  ఫార్ములా–2 కారు రేస్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. తాజాగా కదిరి సమీపంలోని కోటపల్లి వద్ద నిర్మిస్తోంది ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌. రేస్‌ ట్రాక్‌లలో ఇది దేశంలో మూడోది. మన ఏపీలో మొదటిది. దీనికి ‘ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌ (ఎఫ్‌ఐఏ), ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ మోటో సైక్లిజం(ఎఫ్‌ఐఎం) గుర్తింపు పొందింది. కారు రేసింగ్‌తో పాటు కొత్త కార్ల వేగాన్ని పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్‌ ఉపయోగ పడుతుంది. 

కార్‌ రేస్‌ వివిధ ఫార్మాట్లు ఇలా... 
ఫార్ములా–1 (ఎఫ్‌–1):  ఈ రేసులో పాల్గొనే కారుకు 1,000 హెచ్‌పీ(హార్స్‌పవర్‌) ఇంజిన్‌ ఉంటుంది. ప్రపంచ చాంపియన్‌లను దృష్టిలో ఉంచుకొని ట్రాక్‌లను తయారు చేస్తారు. ఈ రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లలో ఉంటాయి. వారాంతంలో ఒక రోజు చొప్పున మూడు వారాల పాటు పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కి.మీ వేగ పరిమితి ఉంటుంది.  
ఫార్ములా–2 (ఎఫ్‌–2): ఈ రేసులో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్‌ ఉంటుంది. కార్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. రేస్‌ కూడా ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. గంటకు 500 కి.మీ వరకూ వేగ అనుమతి ఉంటుంది.  
ఫార్ములా–3(ఎఫ్‌–3): ఈ కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్‌ రేస్‌. ఇందులో పాల్గొనే కార్లన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి... పోటీలు నిర్వహిస్తారు. ఇందులో కార్ల వేగం గంటకు 250 కి.మీ పరిమితి ఉంటుంది.  

ఎంతోమందికి ఉపాధి.. 
ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 మందికి ఉపాధి దొరుకుతుంది. తొలి దశలో ట్రాక్‌తో పాటు ఆస్పత్రి, అతిథి గృహం ఏర్పాటు చేయనున్నారు. రెండు, మూడవ దశల్లో 40 గదులో పెద్ద రిసార్ట్, అమ్యూజ్‌మెంట్‌ పార్కు(వినోద భరిత ఉద్యానవనం), గోల్ఫ్‌ కోర్సు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలో తయారవుతున్న ‘కియా’ కార్లను పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్‌ ద్వారా అవకాశం కల్పిస్తారు. 

పర్యాటక హబ్‌ ఏర్పాటుకు ప్రణాళిక.. 
కోటపల్లి పార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 110 కి.మీ దూరంలో ఉంది. కార్‌ రేసింగ్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల చెందిన వారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ క్రమంలో రాయలసీమలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక హబ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, లేపాక్షి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యోగి వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, పెనుకొండ కోట, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి కోట, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ‘రాయలసీమ హెరిటేజ్‌ సర్క్యూట్‌’ ఏర్పాటుకు అనుమతివ్వాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 

చకాచకా పనులు.. 
ప్రస్తుతం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్‌ ట్రాక్‌ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చుట్టూ ఫెన్సింగ్‌ పూర్తయ్యింది. రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఆస్పత్రి భవనం దాదాపుగా పూర్తి కావచ్చింది. వెయిటింగ్‌ హాలు, విశ్రాంతి గదుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక రేస్‌ ట్రాక్‌ కోసం భూమి చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కార్‌ రేస్‌లు ఏర్పాటు చేసేలా ‘నిధి మార్క్‌ వన్‌ మోటార్స్‌’ కృషి చేస్తోంది. 

రెండేళ్లలో పూర్తి చేస్తాం 
ఏపీలో జగన్‌ ప్రభుత్వం వచ్చాక మాకు కోటపల్లి వద్ద భూములు అప్పగించారు. కోవిడ్‌ కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా జరుగనున్నాయి. రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి చేస్తాం. ఇది బెంగుళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రేసర్లు, ఔత్సాహికులతో పాటు పర్యాటకులను కూడా బాగా ఆకర్షించనుంది. 
–గోవింద రాజన్‌ చక్రవర్తి, నిధి మార్క్‌ వన్‌ మోటార్స్, డైరెక్టర్, బెంగళూరు  

మరిన్ని వార్తలు