మీరు దేశానికే ఆదర్శం 

12 Aug, 2023 04:28 IST|Sakshi

నాలుగో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ము జమ చేస్తూ అక్కచెల్లెమ్మలతో సీఎం జగన్‌   

వారి అభ్యున్నతి కోసం అన్ని విధాల భరోసా కల్పిస్తున్నాం 

ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వంగా నిలిచాం 

99.67 శాతం రికవరీతో స్వయం సహాయక సంఘాలు స్ఫూర్తిదాయకం 

మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల మంది సభ్యులు పెరిగారు 

మన ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం 

బ్యాంకులను ఒప్పించి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాం 

అప్పుల ఊబి నుంచి వెలుగుల వైపు అడుగులు వేసేలా చర్యలు 

వివిధ పథకాల ద్వారా ఆర్థిక, సామాజిక సాధికారతకు ఊతం 

సున్నా వడ్డీ కింద 1.05 కోట్ల మంది ఖాతాల్లో రూ.1353.76 కోట్లు జమ 

9.48 లక్షల డ్వాక్రా సంఘాలకు లబ్ధి.. నాలుగేళ్లలో రూ.4,969 కోట్లు సాయం

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధి­కారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం.

దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర  
గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్‌ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్‌లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయి.

రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్‌ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది.

వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు  ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి.   

అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం 
మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు.

మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం.   

పలు విధాలా భరోసా 
జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు,  వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం.  

 వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. 

పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు.   

సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు  
చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది.  

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం.   

సూర్యోదయానికి ముందే.. 
దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్‌మార్నింగ్‌ అని చెబుతూ పింఛన్‌ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను.   

గతంలో వెయ్యి రూపాయలు పింఛన్‌ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్‌ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం.  

రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర.  

    నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభా­గం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్‌ను 1 కోటి 24 లక్షల మంది డౌన్  లోడ్‌  చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం.  

అక్కచెల్లెమ్మలతో మాటామంతి
సీఎం జగన్‌ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్‌ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు.

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్‌ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి 
అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్‌ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు.

నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్‌ సెంటర్, టిఫిన్‌ సెంటర్‌తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం.   – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం

మేనమామగా నిరూపించుకున్నారు 
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడు­కులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా  నిజమని నిరూపించారు.  విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి.  – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్‌ మండలం 

మరిన్ని వార్తలు