AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్‌

17 Jan, 2023 11:35 IST|Sakshi

ఉచిత విద్యుత్‌ పథకం వ్యవసాయానికి ఎంతో మేలు

సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నిర్ణయం

విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25ఏళ్లపాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదేవిధంగా డాక్టర్‌ వైఎస్సార్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాపై అధికారులతో మంత్రి సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో మొదటి విడత 3వేల మెగావాట్లు, 2025లో రెండవ విడత 3 వేల మెగావాట్లు, 2026లో మూడో విడత వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ విద్యుత్‌ సరఫరా చేస్తుందని వివరించారు. ఆక్వా కల్చర్‌కు సబ్సిడీ ధరపై విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు వారికి ఆర్థికంగా మరింత మేలు కలిగేలా రైతు భరోసా వంటి కా­ర్య­క్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

చెల్లింపులు ఆలస్యమైనా సరఫరా ఆగదు: విజయానంద్‌
డిస్కంల పనితీరును మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తోందని ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ తెలిపారు. ప్రస్తుతానికి డిస్కంలు వ్యవసాయానికి సంవత్సరానికి 12 వేల మిలియన్‌ యూనిట్లను సరఫరా చేస్తున్నాయని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని భరిస్తోందని వివరించారు.

డీబీటీ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నామని, 28,684 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చామని చెప్పారు. అక్కడ వ్యవసాయ వినియోగానికి సంబంధించిన నెలవారీ బిల్లింగ్‌ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోందని, ఒకవేళ చెల్లింపులు సకాలంలో అందకపోయినా డిస్కంలు రైతులకు ఉ­చిత విద్యుత్‌ సరఫరాను కొనసాగిస్తాయని విజ­యా­నంద్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీజెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీ తే­జ్, డిస్కంల సీఎండీలు జె.పద్మ జనార్దనరెడ్డి, కె.సం­తోష్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు