అరుదైన కణితికి శస్త్రచికిత్స 

23 Oct, 2022 08:24 IST|Sakshi

పుట్టుకతోనే చిన్నారి ముక్కుపై  కిలో బరువున్న కణితి

విజయవంతంగా దాన్ని తొలగించిన గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు

తాజాగా బ్రెయిన్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా మరో శస్త్రచికిత్స 

ఆరోగ్యశ్రీ ద్వారా తమ బిడ్డ ప్రాణాలు కాపాడారంటూ తల్లిదండ్రుల సంతోషం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు అత్యంత అరుదైన కణితి టెరటోమాను తొలగించి.. పసికందు ప్రాణాలను కాపాడారు. ఈ వివరాలను ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ సుమితా శంకర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన బీసుపోగు చైతన్య, ఏసయ్య దంపతులకు ఈ ఏడాది జూన్‌లో మగబిడ్డ జన్మించాడు. పుట్టుకతోనే చిన్నారి ముక్కుపై భాగంలో సుమారు కిలో బరువున్న కణితి ఉండటంతో.. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారిని తీసుకొని జీజీహెచ్‌కు వచ్చారు. పిల్లల వైద్యులు బిడ్డను పరీక్షించి న్యూరోసర్జరీ వైద్య విభాగానికి రిఫర్‌ చేశారు. జూన్‌ 4న ఆ పసికందుకు ప్లాస్టిక్‌ సర్జరీ, న్యూరోసర్జరీ వైద్యులు ఆపరేషన్‌ చేసి విజయవంతంగా ముక్కుపై ఉన్న కణితిని తొలగించారు.

ఆ తర్వాత ముక్కు పై భాగంలో ఎక్కువ ఖాళీ ఉండటంతో.. ఇన్‌ఫెక్షన్లు బ్రెయిన్‌కు సోకే ప్రమాదాన్ని వైద్యులు గుర్తించారు. ఈనెల 21న మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఖాళీని పూరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.6 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను.. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్‌ సుమితా శంకర్‌ చెప్పారు. సకాలంలో ఆపరేషన్‌ చేయకపోతే..  పసికందు ప్రాణాలు పోయేవని తెలిపారు. ఇలాంటి అరుదైన ట్యూమర్‌కు ఆపరేషన్‌లు చేసినట్లు మెడికల్‌ జర్నల్‌లో ఇప్పటివరకు నమోదు కాలేదని చెప్పారు. దీనిని మెడికల్‌ జర్నల్స్‌కు పంపిస్తామని తెలిపారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి అభినందించారు. ఆరోగ్యశ్రీ  ద్వారా ఉచితంగా బిడ్డకు ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ప్రభుత్వానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో న్యూరోసర్జరీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సురేంద్ర వర్మ, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు చంద్రలేఖ, నజ్మా, శృతి, గంగా«భవాని తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు