ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు

10 Dec, 2021 09:48 IST|Sakshi

ప్రత్తిపాడు (తూర్పు గోదావరి): కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా అధిగమించవచ్చని నిరూపించాడు ఓ రైతు. కోటనందూరు మండలం ఇండుగపల్లికి చెందిన కంఠంరెడ్డి సోమశేఖర్‌ ఎంఈడీ, ఎంఏలో తెలుగు, చరిత్ర, సైకాలజీ, ప్రభుత్వ పాలన శాస్త్రాల్లో పట్టభద్రుడు. ఈ అర్హతలతో ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. 

కరోనా కల్లోలంలో ప్రైవేట్‌ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చేసేదిలేక అత్తయ్య గ్రామమైన ధర్మవరంలో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొలంబాట పట్టాడు. విద్యావంతుడు కావడంతో అధునిక పద్ధతుల్లో వరి పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ప్రస్తుతం వరి సాగులో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరాకు 35 బస్తాలు దిగుబడిని సాధించాడు. సోమశేఖర్‌ ప్రయోగాలను గుర్తించిన స్థానిక రైతులు ఆయన మార్గంలో ప్రకృతి సాగుకు మక్కువ చూపుతున్నారు.   

మరిన్ని వార్తలు