21న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం

11 Oct, 2022 05:09 IST|Sakshi

సూళ్లూరుపేట: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

యునైటెడ్‌ కింగ్‌డం(యూకే)కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌(వన్‌ వెబ్‌ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్‌ ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్‌ వెబ్‌ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో అర్బిట్‌) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది.

ఈ ఉపగ్రహాలు, వాటితోపాటు ఫ్యూయల్‌ను కలిపితే 5.21 టన్నుల బరువుగా నిర్ధారించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ఎం–2 లాంటి భారీ రాకెట్‌ను వాణిజ్యపరంగా వాడుకునేందుకు వన్‌ వెబ్‌ కంపెనీ మూడుసార్లు 36 చొప్పున 108 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

మరో రెండుసార్లు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో ఇప్పటికే సిద్ధమైంది. వన్‌ వెబ్‌ కంపెనీ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెంది వాణిజ్యపరంగా ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు ఇస్రోతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. 

మరిన్ని వార్తలు