విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు అనుమతించాలి 

13 Nov, 2022 06:30 IST|Sakshi

కేంద్ర మంత్రిని కోరిన ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌   

సాక్షి, అమరావతి: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్‌ యాత్రకు అనుమతించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేల్‌ షేక్‌ గౌసల్‌ ఆజామ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2023లో హజ్‌యాత్రకు వెళ్లేవారిని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపేందుకు వీలుగా పాయింట్‌ను ప్రకటించాలని కోరారు. హజ్‌ యాత్రకు నెల ముందుగా ఏపీ హజ్‌ కమిటీ నుంచి ఒక అధికారిక బృందం మక్కా, మదీనా నగరాలకు వెళ్లి అక్కడి వసతిగృహాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేలా సౌదీ ప్రభుత్వ అనుమతిని ఇప్పించాలని కోరారు. ఏపీ హజ్‌ కమిటీ సభ్యులు ఇషాక్‌ బాషా, రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి అబ్దుల్‌ ఖాదిర్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు