సమయస్ఫూర్తితో రక్షించాడు

12 Aug, 2020 12:34 IST|Sakshi
గౌతమీ గోదావరిలో నుంచి రమేష్‌ను తాడుతో పైకి లాగుతున్న ప్రయాణికులు(అంతర చిత్రం) రమేష్‌ను రక్షించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌  

గోదావరిలో పడిన యువకుడిని కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ 

ప్రభాకర్‌ స్పందనపై అభినందనల వెల్లువ

ఆలమూరు (కొత్తపేట): పదహారో నంబర్‌ జాతీయ రహదారిలోని ఆలమూరు గౌతమీ గోదావరి వృద్ధ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిన యర్రా రమేష్‌ను ఆలమూరు పోలీసుస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జి.ప్రభాకర్‌ రక్షించారు. స్థానికుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలంలోని అంగరకు చెందిన రమేష్‌ రావులపాలెం నుంచి తిరుగు జొన్నాడ వైపు బైక్‌పై వస్తున్నాడు. అంతలోనే బైక్‌ వృద్ధ వంతెనపై ఉండగా రమేష్‌ మాత్రం గోదావరిలో పడిపోయి రక్షించండి అంటూ హాహాకారాలు చేస్తున్నాడు. అదే సమయంలో కొత్త వంతెనపై రావులపాలెం వైపు వెళుతున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ గమనించి  రమేష్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. 

ఆ దారిన వెళుతున్న లారీని ఆపి అందులో ఉన్న తాడును తీసుకుని ప్రయణికుల సాయంతో గోదావరిలో కొట్టుకుపోతున్న రమేష్‌కు అందించారు. దీంతో ఆ యువకుడు ఆ తాడు సాయంతో అతి కష్టంపై పైకి చేరుకున్నాడు. రక్షించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌తో పాటు ప్రయాణికులకు రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ను అభినందించాడు. మెరుగైన చికిత్స కోసం రమేష్‌ను రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. 

గోదావరిలో ఎలా పడిపోయాడో.. 
అంగరకు చెందిన రమేష్‌ గౌతమీ గోదావరిలో ఎలా పడిపోయాడనే విషయంపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. వృద్ధ గౌతమీ వంతెన మధ్యలో బైక్‌ను ఆపి గోదావరి అందాలను తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిపోయాడని కొందరు చెబుతున్నారు. వృద్ధ వంతెన మధ్యలోకి వచ్చే సరికి బైక్‌లో ఉన్న ఇంధనం అయిపోతే తెచ్చుకునేందుకు వాహనం కోసం ఎదురు చూస్తూ రెయిలింగ్‌పై కూర్చొని ప్రమాదవశాత్తూ పడిపోయారని మరి కొంతమంది వాదనగా ఉంది. బైక్‌ గోతిలో పడడంతో రమేష్‌ అదుపు తప్పి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిపోయాడని ఆలమూరు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా గోదావరిలో పడిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో కుటుంబసభ్యులు, స్థానికుల్లో ఆనందాన్ని నింపింది.  

మరిన్ని వార్తలు