RainFall: అనంత, సత్యసాయి జిల్లాల్లో దంచేసిన వాన

19 May, 2022 08:24 IST|Sakshi

సాక్షి, అనంతపురం: నైరుతి ఇంకా పలకరించకమునుపే వరుణుడు జిల్లాను తడిపేస్తున్నాడు. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 28 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒకేరోజు 27.3 మిల్లీమీటర్ల (మి.మీ) సగటు వర్షపాతం నమోదు కావడం విశేషం. ఆత్మకూరు మండలంలో భారీ వర్షం (113.2 మి.మీ) కురిసింది.

బొమ్మనహాళ్‌ 69 మి.మీ, ఉరవకొండ 60.2, గుమ్మఘట్ట 45.4, కళ్యాణదుర్గం 44.4, డి.హీరేహాళ్‌ 36.6, రాయదుర్గం 36.4, కంబదూరు 35.4, కూడేరు 33.4, తాడిపత్రి 32.2, కణేకల్లు 30, కుందుర్పి 29.6, పెద్దపప్పూరు 28.6, శెట్టూరు 24.6, రాప్తాడు 23.8, బెళుగుప్ప 23, విడపనకల్లు 22.2, అనంతపురం 18.6, వజ్రకరూరు 16, గార్లదిన్నె 15.2, శింగనమల 14.8, పామిడి 12.6, గుత్తి 11.2 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ మోస్తరుగా వర్షం కురిసింది. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా ఇప్పటికే 63.9 మి.మీ నమోదైంది. 12 మండలాల్లో సాధారణం, మిగతా 19 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడ్డాయి. ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న జిల్లా రైతులు ఈ వర్షాలకు భూములు దుక్కి చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. కొందరు రైతులు జూన్‌ మొదటి వారంలోనే విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు.

చదవండి: (పాలనలో ప్రవీణ్‌ ముద్ర)

సాక్షి, పుట్టపర్తి: నైరుతి తొలకర్లు పలకరించకమునుపే వరుణుడు కరుణిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా వర్షిస్తూ సాగుకు రైతన్నను సమాయత్తం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఏకంగా 31.4 మి.మీ భారీ సగటు వర్షపాతం నమోదైంది. మడకశిర 98.2 మి.మీ, రొద్దం 91.2 మి.మీ, పెనుకొండ 82.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే రామగిరి 64.2 మి.మీ, కనగానపల్లి 63.2 మి.మీ, హిందూపురం 54.2 మి.మీ, చెన్నేకొత్తపల్లి 52.4 మి.మీ, అమడగూరు 46.6 మి.మీ, గుడిబండ 41.2 మి.మీ, అమరాపురం 40 మి.మీ, అగళి 36.4 మి.మీ, ఓడీ చెరువు 35.2 మి.మీ, ఎన్‌పీ కుంట 34.2 మి.మీ, సోమందేపల్లి 33.4 మి.మీ, పరిగి 27.6 మి.మీ, రొళ్ల 26.4 మి.మీ, చిలమత్తూరు 25.8 మి.మీ, లేపాక్షి 18.4 మి.మీ, ధర్మవరం 18.2 మి.మీ, కొత్తచెరువు 17.2 మి.మీ, బత్తలపల్లి 15.6 మి.మీ, పుట్టపర్తి 15.2 మి.మీ, బుక్కపట్నం 14 మి.మీ, నల్లమాడ 11.8 మి.మీ, తనకల్లు, గోరంట్ల 11.2 మి.మీ, నల్లచెరువు 10.4 మి.మీ మేర వర్షం కురిసింది. మిగతా మండలాల్లోనూ తేలికపాటి వర్షపాతం నమోదైంది.  

అధికంగా వర్షాలు.. 
మే నెల జిల్లా సాధారణ వర్షపాతం 42.4 మి.మీ కాగా, ఇప్పటికే 78.6 మి.మీ నమోదైంది. అగళిలో సాధారణం కాగా మిగతా 30 మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు కురుస్తుండటంతో హిందూపురం, మడకశిర, రొద్దం ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడా పెన్నానది కూడా ప్రవహిస్తోంది. 

పొలం పనుల్లో రైతన్న .. 
అదనులో జిల్లా అంతటా పదను వర్షం కావడంతో ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొలాలు దుక్కులు చేసుకునేందుకు పొలంబాట పట్టారు. మంచి వర్షాలు కురిస్తే జూన్‌ మొదటి పక్షంలోనే వేరుశనగ, కంది, మొక్కజొన్న లాంటి పంటలు ముందస్తుగా విత్తుకునేందుకు చాలా మండలాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారు.  

మరిన్ని వార్తలు