‘పేదలందరికీ ఇళ్లు’ అప్పీలుపై విచారణ 26కి వాయిదా 

22 Oct, 2021 02:12 IST|Sakshi

పిటిషనర్‌ ప్రస్తావించని అంశాలపైనా సింగిల్‌ జడ్జి తీర్పు

హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

తీర్పు సర్టిఫైడ్‌ కాపీని తమ ముందుంచాలన్న ధర్మాసనం

సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్‌  చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. ఈ అప్పీల్‌తో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్‌ కాపీని జత చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ప్రస్తావించని అంశాలపై కూడా సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని నివేదించారు. ఆ అంశాలపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. 

అభ్యంతరం లేదు.. దుష్ట సంప్రదాయం కారాదనే
పేదలందరికీ ఇళ్ల పథకం వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ పెండింగ్‌లో ఉందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సింగిల్‌ జడ్జి  తీర్పునిచ్చారని ఏఏజీ పేర్కొన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పు వల్ల 30 లక్షల మందికిపైగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్‌ కాపీ లేకపోవడాన్ని గమనించింది. దీనిపై ఏఏజీ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరింది. ఈ నెల 8న సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని, ఆ మరుసటి రోజే తాము అప్పీల్‌ దాఖలు చేశామని, అప్పటికి తీర్పు సర్టిఫైడ్‌ కాపీ అందుబాటులో లేనందున అప్పీల్‌తో జత చేయలేకపోయామని తెలిపారు.

సర్టిఫైడ్‌ కాపీ స్థానంలో వెబ్‌ కాపీని జత చేశామని వివరించారు. అందువల్ల సర్టిఫైడ్‌ కాపీ దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశామని తెలిపారు. ఈ అనుబంధ పిటిషన్‌ను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే సర్టిఫైడ్‌ కాపీ లేకుండా ప్రభుత్వ అప్పీల్‌ను విచారిస్తే అది ఒక దుష్ట సంప్రదాయంగా మారుతుందని, రేపు ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్‌ కాపీ లేకుండా అప్పీళ్లు వేసి విచారించాలని కోరతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సర్టిఫైడ్‌ కాపీని తమ ముందుంచాలని సూచిస్తూ అప్పీల్‌పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు