విద్యార్థినికి సీటు నిరాకరణపై హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ 

24 Sep, 2021 03:34 IST|Sakshi

గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌కు, ఇంటర్‌ బోర్డు అధికారులకు నోటీసులు 

కర్నూలు (సెంట్రల్‌): కరోనా నేపథ్యంలో ఏడాదిపాటు చదువుకు దూరమైన విద్యార్థినిని ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి నిరాకరించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) సీరియస్‌ అయింది. దీనిపై కంబాలపాడు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు ఇంటర్‌ బోర్డు కమిషనర్, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌లకు హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. కర్నూలు జిల్లా సి.బెళగళ్‌ మండలం పోలకల్‌కు చెందిన ఎం.శ్రావణి 2020లో పదో తరగతి పాసైంది. అదే ఏడాది కరోనా విజృంభిస్తుండటంతో ఆమె కాలేజీలో చేరలేదు.

ఈ సంవత్సరం కర్నూలు జిల్లా కంబాలపాడు గురుకుల కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె మార్కుల ఆధారంగా బైపీసీలో సీటు వచ్చింది. అయితే గతేడాది ఆమె ఇంటర్‌లో చేరకపోవడంతో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదంటూ ఆమెకు సీటును నిరాకరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో హెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆమెకు సీటు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు ఇంటర్‌ బోర్డు కమిషనర్, బోర్డు రీజినల్‌ డైరెక్టర్‌లకు నోటీసులు పంపింది. నెల రోజుల్లో ఏమి చర్యలు తీసుకున్నది వివరించాల్సిందిగా కమిషన్‌ చైర్మన్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు  ఎం.శ్రీనివాసరావులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.  

మరిన్ని వార్తలు