పైరు పచ్చగా.. రైతుకు నిశ్చింత

3 Aug, 2020 03:19 IST|Sakshi

ప్రభుత్వ ప్రోత్సాహం.. సమృద్ధి వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలం

అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు

విత్తనాల నుంచి ఎరువుల దాకా ఏది కావాలన్నా లభ్యం

రైతుల నుంచి 1,00,269 ఆర్డర్లు 

రెండు నెలల్లోనే రూ.37.06 కోట్ల మేర విక్రయాలు

ఆగ్రోస్, వ్యవసాయశాఖల సమష్టి కృషి ఫలితం

సాక్షి, అమరావతి: రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులమీదుగా ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాలను రైతాంగం అక్కున చేర్చుకుంటోంది. నాణ్యత, పంపిణీలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వహిస్తుండటంతో అన్నదాతలు సాగుకు అవసరమైనవి నిశ్చింతగా కొనుగోలు చేస్తున్నారు. ఒక బస్తా యూరియా కావాలన్నా ఆర్డరు ఇచ్చిన వెంటనే అందిస్తుండటంతో వీటికి ఆదరణ పెరిగింది. జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్న ఆర్బీకేల సిబ్బంది సూచనలు, సలహాలను సాదరంగా ఆహ్వానిస్తూ రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు, పశువుల మేత ఇతర పరికరాల విక్రయాలను ముఖ్యమంత్రి జగన్‌ గ్రామస్థాయికి చేర్చడంతో అవి అంచనాలకు మించి సేవలందిస్తున్నాయి. ఆర్బీకేలలో ఇప్పటివరకు 1,00,269 ఆర్డర్ల ద్వారా రూ.37.06 కోట్ల విలువ చేసే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను రైతులు కొనుగోలు చేశారు.
 

సర్టిఫైడ్‌ విత్తనాలు..
– నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్‌ నుంచి ఆగ్రోస్‌ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ) ఎరువులను కొనుగోలు చేస్తోంది. ఆర్డరు తీసుకున్న వెంటనే ఆర్బీకే సిబ్బంది ఆగ్రోస్‌ కార్యాలయాలకు ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు తెలియచేస్తారు. ఎరువులు, క్రిమిసంహారక మందులకు సంబంధించి 95 కంపెనీలతో ఎంవోయూలు చేసుకోగా 
జిల్లాకు ఐదు హబ్‌లు ఏర్పాటయ్యాయి. 
– వివిధ కంపెనీలు సరఫరా చేస్తున్న ఎరువులు, విత్తనాల నాణ్యతను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌ల్లో తనిఖీ చేసి సర్టిఫై చేస్తున్నారు. 

డిజిటల్‌ పేమెంట్‌....
– ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు రైతు భరోసా కేంద్రాల్లో నగదు చెల్లింపులతోపాటు డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
గూగుల్‌ పే, పేటియం, ఫోన్‌ పే, భీమ్‌ తదితర డిజిటల్‌ విధానాల్లోనూ చెల్లించవచ్చు. 
– దేశంలో తొలిసారిగా కియోస్క్‌ల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రామస్ధాయిలోని 10,641 రైతు భరోసా కేంద్రాల్లో వీటి ద్వారా రైతులు నగదు చెల్లించవచ్చు. ఇది వెంటనే ఆగ్రోస్‌ ఖాతాలో జమ అవుతుంది. నగదు చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఈ విధానాన్ని తెచ్చారు.

దారికొస్తున్న ప్రైవేట్‌ డీలర్లు 
– శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు, ఆగ్రోస్‌ ఎండీ 
‘గ్రామస్ధాయిలో ఏర్పాటైన ఆర్బీకేలు సత్ఫలితాలనిస్తున్నాయి. రైతులకు ఒకటి రెండురోజుల్లోనే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు సరఫరా చేస్తున్నాం. వీటికి లభిస్తున్న ఆదరణ చూసి ప్రైవేట్‌ వ్యాపారులు ధరలు తగ్గించి అమ్ముతున్నారు. గతంలో రైతులు కాంప్లెక్సు ఎరువులు అడిగితే పొటాష్, జింకు లాంటివి అంటగట్టారు. ఇప్పుడు వీటికి తెరపడింది. కియోస్క్‌లపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా సాలీనా రూ.300 కోట్ల మేర విక్రయాలు జరిగే అవకాశం ఉంది’

‘గతంలో విత్తనాలు, పురుగు మందుల కోసం రైతులు మండల, నియోజకవర్గాల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. అదునులో లభ్యంకాక ఎన్నో అవస్థలు పడ్డారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావడంతో ఇక రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు గ్రామంలోనే అందుబాటులోకి వస్తాయి. ఆర్బీకేల్లోని వ్యవసాయ, అనుబంధ సంస్థల సహాయకులు రైతులకు చేదోడువాదోడుగా ఉంటారు. భూసారం నుంచి వాతావరణం వరకు, విత్తనం నుంచి అమ్మకం వరకు, పాడి నుంచి పంట వరకు అన్ని వేళలా అన్ని విధాలుగా రైతన్నకు అండగా, ఇంటి గడప వద్దే సేవలందించేందుకు ఆర్బీకేలు దోహదపడతాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ  కేంద్రాలుగానూ పని చేస్తాయి’’
– ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మే 30న ఆర్బీకేల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌ 

బయట కొని చాలా నష్టపోయా..
– మల్లెల కోటేశ్వరరావు, కాళీబుగ్గ, పెదకూరపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా 
‘రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమైన రోజే పిల్లిపెసర విత్తనాలు, ఎరువులు బుక్‌చేశా. నాకు నచ్చిన కంపెనీల విత్తనాలు, ఎరువులు కొన్నా. వాటిల్లో లోపం ఉన్నా, కల్తీలు ఉన్నా ప్రశ్నించే అధికారం ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్‌ డీలర్లు, విత్తనాల కంపెనీలను అలా అడిగే అవకాశం ఉండదు. గతంలో నకిలీ పత్తి, మిరప విత్తనాలు కొని చాలాసార్లు నష్టపోయా. ఆర్బీకేల్లో అన్ని సేవలతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు పెరగాలి’ 

రూ.3,600 కిరాయి ఆదా అయ్యింది..
మా గ్రామంలోని ఆర్బీకేలో నేను, మా బాబాయి కలిసి 40 బస్తాల యూరియా, కాంప్లెక్సు, పొటాష్‌ బుక్‌ చేస్తే రెండో రోజే మా ఇంటికే ఎరువులు పంపారు. గతంలో ఒకరోజు పని మానుకుని కంకిపాడు నుంచి బస్తాకు రూ.30 కిరాయి చెల్లించి తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు రూ.1,200 కిరాయి ఖర్చులు మిగిలాయి. సార్వాలో కనీసం 120 బస్తాల ఎరువులు కొనుగోలు చేస్తా. ఆర్బీకేలతో రూ.3,600 కిరాయి ఖర్చులు ఆదా అవుతాయి. ప్రముఖ కంపెనీల ఎరువులు లభ్యమవుతున్నాయి. వీటి వాడకంపై వ్యవసాయశాఖ కూడా సూచనలు అందించింది.
– జి.మురళీకృష్ణారెడ్డి,పెద ఓగిరాల, కృష్ణా జిల్లా  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు