సపరివార స'మేత'!

22 Sep, 2020 04:28 IST|Sakshi

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో అంతా వేమూరి బంధుగణమే

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ముసుగులో ఖజానాకు తూట్లు.. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్‌కు అక్రమంగా పనులు  

సాక్షి, అమరావతి: ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ముసుగులో నాటి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ అండదండలతో ఈవీఎంల చోరీ కేసులో నిందితుడు వేమూరి హరికృష్ణప్రసాద్‌ సకుటుంబ సపరివార సమేతంగా దోపిడీకి పాల్పడ్డారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు అమలుకు ఏర్పాటైన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌(ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌)లో తన బంధు గణాన్ని, అనుచరులను నియమించుకుని యథేచ్ఛగా అక్రమాలకు తెగబడ్డారు. 

అంతా తనవాళ్లే...! 
► టెరాసాఫ్ట్‌ ఎండీ తుమ్మల గోపీచంద్‌ చౌదరి స్నేహితుడు అట్లూరి రామారావు చౌదరిని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ టెక్నికల్‌ ఈడీగానూ, సమీప బంధువు, ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి ఎం.వెంకటేశ్వరరావు చౌదరిని ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్‌ ఈడీగానూ, మరో బంధువు, పురపాలక శాఖ ఉద్యోగి సూర్యదేవర హరికృష్ణ చౌదరిని కమర్షియల్‌ ఈడీగానూ నియమించేలా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ సలహాదారు హోదాలో వేమూరి చక్రం తిప్పారు.  
► తన సంస్థ నెట్‌ ఇండియాలో పనిచేస్తున్న వల్లభనేని చంద్రశేఖర్‌ చౌదరిని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో ఈడీ(టెక్నికల్‌స్ట్రాటజీ) గా నియమించుకున్నారు. 
► ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా చేపట్టే పనులకు టెండర్‌ షెడ్యూళ్లపై వల్లభనేని చంద్రశేఖర్‌కు సూచనలు చేసి వాటిని టెరా సాఫ్ట్, అనుబంధ సంస్థలకే దక్కేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు.  

బ్లాక్‌లిస్ట్‌లో కంపెనీకి పనులు.. 
► ఇక టెండర్‌ ఎవల్యూషన్‌ (మదింపు) కమిటీలోనూ నియమితుడైన  వేమూరి హరికృష్ణప్రసాద్‌ టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్‌(ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా అక్రమంగా పనులు దక్కించుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఫైబర్‌ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారు. 

తన సంస్థకు తానే సర్టిఫికెట్లు.. 
► ఫైబర్‌ గ్రిడ్‌ తొలి దశలో రూ.333 కోట్ల విలువైన పనులను టెరా సాఫ్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన వేమూరి నాసిరకంగా పనులు చేశారు. తొలి దశ పనుల ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌గా జెమినీ కమ్యూనికేషన్స్‌ ఎంపిక కాగా ఆ సంస్థ నుంచి నెట్‌ ఇండియా సబ్‌ కాంట్రాక్టు తీసుకుంది. నాసిరకంగా చేసిన పనులు నాణ్యంగా ఉన్నట్లు నెట్‌ ఇండియా సర్టిఫికెట్‌ ఇస్తే టెరా సాఫ్ట్‌కు బిల్లులు చెల్లించారు. ఇలా తన సంస్థ చేసిన పనులకు తనకు చెందిన మరో సంస్థతో సర్టిఫికెట్‌ ఇప్పించుకుని దోచుకున్నారు.

అనుభవం లేకున్నా కుమార్తె కంపెనీకి పనులు.. 
► నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థకు వేమూరి హరికృష్ణప్రసాద్‌ కూతురు అభిజ్ఞ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. నెటాప్స్‌ సంస్థకు ఫైబర్‌ లేయింగ్‌ అనుభవం లేకున్నా ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌ గ్రిడ్‌ లైన్ల పనులను రూ.30 కోట్లతో అప్పగించారు. కిలోమీటర్‌ ఫైబర్‌ లేయింగ్‌కు ఇతర రాష్ట్రాల్లో రూ.15 వేలు మాత్రమే ఉండగా ఏపీలో మాత్రం 600 మీటర్ల ఫైబర్‌ లేయింగ్‌ పనులకు రూ.42 వేల చొప్పున నెటాప్స్‌కు బిల్లులు చెల్లించడం గమనార్హం. 
► ఫైబర్‌ గ్రిడ్‌ తొలిదశ పనుల పర్యవేక్షణ, నిర్వహణకు 2016 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు ప్రతి నెలా రూ.1.2 కోట్ల చొప్పున చెల్లించారు. ఫైబర్‌ గ్రిడ్‌ రెండో దశలో రూ.1,410 కోట్ల విలువైన పనులను తన సంస్థ  టెరా సాఫ్ట్‌కే కట్టబెట్టేలా చక్రం తిప్పిన వేమూరి నాసిరకం ఫైబర్‌ వేసి బిల్లులు చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు