ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్నందుకు గర్వపడుతున్నా

28 Dec, 2022 04:42 IST|Sakshi
మాట్లాడుతున్న విద్యార్థి జ్యోతికృష్ణ

ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆకట్టుకున్న విద్యార్థి ప్రసంగం  

నగరి(చిత్తూరు జిల్లా): ‘గతంలో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులను చూసినప్పుడల్లా బాధపడేవాడిని.. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. వారికంటే ఎక్కువ వసతులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని చదువుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులు బాధపడుతున్నారు’ అంటూ ఓ విద్యార్థి తన అనుభవాన్ని వెల్లడించాడు.

చిత్తూరు జిల్లా నగరి పీసీఎన్‌ హైస్కూల్‌లో మంగళవారం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఆర్కే రోజా హాజరైన ఈ సభలో జ్యోతికృష్ణ అనే 8వ తరగతి విద్యార్థి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిని కళ్లకుగట్టింది. ‘నేను గతంలో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులను చూసినప్పుడల్లా బాధపడేవాడిని. కానీ ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఒక మేనమామలా మమ్మల్ని చదివిస్తున్నారు.

అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన.. ఇలా ఎన్నో పథకాలు పెట్టి మేము ఎంతో  సంతోషంగా చదువుకునేలా చేశారు. నాడు–నేడు పథకం ద్వారా మా స్కూల్‌ను కార్పొరేట్‌ పాఠశాల కంటే గొప్పగా మార్చారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా లేనివిధంగా ఆధునిక వసతులు కల్పించారు. టేబుళ్లు, బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు, మినరల్‌ వాటర్, నిరంతర నీటి వసతితో బాత్రూమ్‌లు.. ఇలా అనేక సదుపాయాలు ఇప్పుడు మా పాఠశాలలో ఉన్నాయి.

ఉచితంగా షూలు, బెల్టులు, టై, బ్యాగ్, పుస్తకాలిస్తున్నారు. రోజుకొక వెరైటీతో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న మాకు వేలాది రూపాయల విలువైన బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినైనందుకు ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా. విద్యార్థులందరి తరఫున థాంక్యూ జగన్‌ మామయ్యా’ అంటూ జ్యోతికృష్ణ కృతజ్ఞతలు తెలిపాడు. విద్యార్థి ప్రసంగానికి ముగ్ధులైన మంత్రి ఆర్కే రోజాతో పాటు స్థానికులు జ్యోతికృష్ణను అభినందించారు.  

మరిన్ని వార్తలు