ఔషధ గుణం.. తారా వనం..

29 May, 2022 04:29 IST|Sakshi
పాదగయ క్షేత్రంలో మేడి(ఔదంబరీ) వృక్షానికి మొక్కుతున్న భక్తులు

నక్షత్ర వనాలకు పెరిగిన ప్రాధాన్యం

నక్షత్రానికో మొక్క పేరుతో వన సంరక్షణకు వినూత్న ప్రయోగం

పిఠాపురం: వృక్షారాధన భారతీయుల ఆచారంగా కొనసాగుతోంది. ప్రతి దైవక్షేత్రానికి ఒక స్థల వృక్షం ఉంటుంది.తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయ స్థలవృక్షం చింత చెట్టు. ద్వాదశ రాశులు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలతో పవిత్రమైన వృక్షాలకు అనుబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 

నక్షత్ర వనాలు.. 
ప్రకృతిని ప్రభావితం చేసే పచ్చని వృక్షాలు జీవరాశుల మనుగడకు దోహదం చేస్తున్నాయి. ప్రతి గ్రహానికి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుందని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. నవగ్రహారాధనలో వృక్షాలకు ప్రత్యేక స్థానం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కో కాలంలో ఒక్కో చెట్టును పూజిస్తుంటారు.నవ గ్రహాల్లో చంద్రుడికి మోదుగ, సూర్యుడికి ఎర్ర చందనం, అంగారకుడికి చండ్ర, బుధుడికి రావి, గురుడుకి ఉత్తరేణి, శుక్రుడికి వెలగ, శనీశ్వరుడికి జమ్మి, రాహువుకు గరిక, కేతువుకు దర్ప వృక్షాలను పూజించాలని వేదాలు చెబుతున్నాయి.

ఆగమ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు, 9 గ్రహాలకు సంబంధించి 36 రకాల వృక్షాలను గ్రహాలు, నక్షత్రాలకు సూచికగా చెబుతుంటారు. నక్షత్రాల్లో అశ్వినికి ముషిని, భరణికి ఉసిరి, కృత్తికకు మేడి, రోహిణికి నేరేడు, మృగశిరకు సండ్ర, ఆరుద్రకు గుమ్మడి, పునర్వసుకు సదనం, పుష్యమికి రావి, ఆశ్లేషకు నాగకేశరి, మూలాకు శ్రీగంధం, పూర్వాషాఢకు వందనం, ఉత్తరాషాఢకు పనస, శ్రవణానికి తెల్ల జిల్లేడు, ధనిష్టకు ఇనుపతుమ్మ, శతభిషానికి కదంబ, పూర్వాభాద్రకు వేప, ఉత్తరాభాద్రకు మామిడి, రేవతికి ఇప్ప, మఖకు మర్రి, పుబ్బకు మోదుగ, ఉత్తరకు జువ్వి, హస్తకు అడివి మామిడి, చిత్తకు మారేడు, స్వాతికి తెల్లమద్ది, వైశాఖకి పులివెలగ, అనురాధకు పొగడ, జేష్టకు బూరుగు మొక్కలు నాటడం మంచిదని చెబుతున్నారు.

ఆయుర్వేద వనమూలికలుగా చెప్పే నక్షత్ర వృక్షాల కొమ్మలతో హోమం నిర్వహిస్తే వాటి నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని రక్షిస్తుందని, గాలిని శుభ్రపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. 

నా మొక్క నా శ్వాస
నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఉమర్‌ అలీషా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలనే సంకల్పంతో ఇటీవల నక్షత్రవనం నిర్మాణం చేపట్టాం. 
– డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీవిశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు, పిఠాపురం 

నక్షత్రాలను బట్టి మొక్కలు 
ఎవరి నక్షత్రానికి తగ్గ మొక్కను నాటడం వారికి చాలా మంచిది. ఆయా నక్షత్రాల ప్రకారం ఔషధ మొక్కలు నాటితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
– అల్లంరాజు చంద్ర మౌళి, వేద పండితులు, పిఠాపురం 

>
మరిన్ని వార్తలు