బీజేపీపై కల్వకుంట్ల కుటుంబం విషప్రచారం

29 May, 2022 04:27 IST|Sakshi

ఉద్యమంలో లేని వారంతా సీఎం కేసీఆర్‌ పక్కన ఉన్నారు 

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీదే అధికారం 

కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి 

కవాడిగూడ (హైదరాబాద్‌): భారతీయ జనతా పార్టీపై కల్వకుంట్ల కుటుంబం విషప్రచారం చేస్తోందని, అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్మడంలేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశకీర్తి ప్రతిష్టలు పెంచారని కొనియాడారు. గత యూపీఏ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలే వెలుగుచూశాయని, మోదీ ప్రధాని పదవి చేపట్టి అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తున్నారని ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజూ పాల్గొనని నేతలంతా ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పక్కనే ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పాలనపై విసుగుచెంది కవులు, కళాకారులు, మేధావులు టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ  మోదీ, అమిత్‌షాల సారథ్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు ఏ ఒక్కరోజు ఆలస్యం కాకుండా విడుదల చేస్తున్నా రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిధులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు