జనసేన కార్యకర్తలకు మరోసారి గట్టి షాక్‌.. 

14 Nov, 2022 11:46 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: వరుసగా జనసేన శ్రేణులకు చుక్కెదురైంది. మొన్న ఇప్పటం, నిన్న పెడన, తాజాగా గోలుగొండలో జనసేన కార్యకర్తలకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నేతలకు మరోసారి ఊహించని షాక్‌ తగిలింది. జనసేన కార్యకర్తలపై మహిళలు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తెల్లముఖం వేశారు. 

వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గోలుగొండలో జగనన్న కాలనీల్లోకి జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో, జనసేన శ్రేణులు బిక్కమొహంతో వెనుదిరిగారు. కాగా, జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలు.. అక్కడ అవినీతి జరిగిందంటూ ఓవరాక్షన్‌ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు డబ్బులు సరిపోలేదని.. ప్రభుత్వాన్ని డబ్బులు అడగాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో, స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు.. మీరు(జనసేన శ్రేణులు) ఇక్కడికి వచ్చి ఎలాంటి రాజకీయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న.. ఎలాంటి అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు ఇచ్చారు. దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. 

మీరు వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు అడగాలని మాకు చెప్పే పనిలేదు. మాకు ఏం కావాలో జగనన్నకు తెలుసు. జగనన్న మాకు అన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము ఒక్క రూపాయి కూడా అడగము. కావాలంటే మీరే మాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కౌంటర్‌ ఇచ్చారు. దీంతో బిక్కమొహం వచ్చిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెనుదిగారు.

మరోవైపు.. టీడీపీ, జనసేనలపై ఎ‍మ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణను ఓర్పలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు. 

మరిన్ని వార్తలు