వాళ్లను తిప్పికొడదాం.. జగనన్నే మా భవిష్యత్తు నినాదంతో ముందుకు పోదాం

13 Feb, 2023 19:46 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో.. ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,  ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం జగన్‌.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ప్రతీ గడపకూ వెళ్లి గృహ సారథులు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. 


గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఎన్నికల కోడ్ లేని  జిల్లాల్లో గడప గడప మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. 

93 శాతం గృహసారథుల నియామకం పూర్తి
దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నామని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవాళ్లు.  గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి.

డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌
సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్‌ టు డోర్‌ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహసారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలన్నారు.

వాళ్లను తిప్పికొడదాం
సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. వాటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్‌ సూచించారు. 

పుంజుకోవాల్సిందే

గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ దాదాపు 7,447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ జరిగింది. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించారు ఎమ్మెల్యేలు. అలాగే.. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలని సీఎం జగన్‌.. ఎమ్మెల్యేలకు సూచించారు. గడప గడప కి మనప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం జగన్‌..  నిర్వహణలో వెనకబడ్డ ఎమ్మెల్యేలు పుంజుకోవాలని చెప్పారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఆ ఎమ్మెల్యేలు మెరుగుపడాలని తెలిపారు. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. నిరంతరం ప్రజలోనే ఉండాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. 


మరిన్ని వార్తలు